మంచిర్యాలఅర్బన్: చెడుపై మంచి సాధించిన విజయానికి.. శక్తి ఆరాధనకు ప్రతీక దసరా పండుగ. అశ్వయుజ శుద్ధ దశమి రోజున విజయదశమి నిర్వహిస్తారు. దసరాకు ముందు తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. విజయదశమి రోజు సాయంత్రం జమ్మి చెట్టును దర్శించుకుని పూజించడం, బంగారం(శమీ ఆకులు) ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీ. మంగళవారం దసరా పండుగ నిర్వహణకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యేక పూజల కోసం ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు.
59 ఏళ్లుగా ఆలయం నుంచి..
1967లో విశ్వనాథ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి శ్రీదేవిభూదేవి సహిత వేంకటేశ్వరస్వామి, పార్వతిపరమేశ్వర్లు ఉత్సవ విగ్రహాలతో నగర వీధుల మీదుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలోని జమ్మి చెట్టుకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పురప్రముఖులు, ప్రజల సమక్షంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జమ్మి ఆకులు ఇచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ.
బోయల పల్లకి సేవ..
ఆలయ ప్రారంభంలో విశ్వనాథస్వామి దేవస్థానం నుంచి గర్మిళ్ల ఆలయం వరకు బోయలు ఉత్సవమూర్తులకు పల్లకి సేవ చేసేవారు. కాలక్రమేణ గోదావరి తీరంలో గౌతమేశ్వర ఆలయం వరకు ట్రాక్టర్లపై శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వీదుగా దాదాపు 59 ఏళ్లుగా రథోత్సవం కొనసాగుతోందని ఆలయ ఈవో ముక్తా రవి తెలిపారు.
రాంనగర్‌లో ..
స్థానిక రాంనగర్‌లో దసరా పండుగ సందర్భంగా రావణ దహనం కార్యక్రమం కొనసాగుతోంది. పది తలలు కిరీటం, మీసాలు చేతిలో పెద్ద ఖడ్గంతో ఉన్న రావణాసురిడి బొమ్మ తయారు చేయించి దహనం చేస్తారు. కాలనీ వాసులు ఐక్యతతో 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
బెల్లంపల్లిలో రావణాసురుడి ప్రతిమ ఏర్పాటు
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో విజయదశమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రావణాసుర వధ మంగళవారం రాత్రి నిర్వహణకు సింగరేణి తిలక్‌స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 వేల మంది వరకు ప్రజలు రానున్నట్లు అంచనా. స్టేడియంలో మూడు రోజు లుగా సభా వేదిక, రావణాసురుని ఆకారంతో కూడిన ప్రతిమ పనులు చేస్తున్నారు. ఏర్పాట్లను హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరవుతారని ప్రకటించారు.


