బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి బలవన్మరణం

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

వెల్గటూర్‌: జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలంలోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌కు చెందిన పల్లపు భూమన్న (35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మానసిక స్థితి కూడా సరిగా ఉండడం లేదు. కుటుంబ సభ్యులతో గొడవపడుతుండేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన భూమన్న వెల్గటూర్‌ శివారులోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకాడు. ఆదివారం ఉదయం మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేకనే బలవన్మరణానికి పాల్పడ్డాడని భూమన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

మనస్తాపంతో ఒకరు..

లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్‌ కాలనీకి చెందిన అజ్మీరా శ్రీను (42) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఎస్సై గోపతి సురేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీను గత కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినడంలేదు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగొద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఉరేసుకుని వృద్ధుడు..

లక్సెట్టిపేట: మండలంలోని గోదావరి రోడ్‌లో చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పదకొండో వార్డుకు చెందిన లింగయ్య(60)గా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

ఉట్నూర్‌రూరల్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ఉట్నూర్‌ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్సెట్టిపేట గ్రామానికి చెందిన అర్కా ప్రభు ఇంద్రవెల్లి వైపు నుంచి ఉట్నూర్‌ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మండలంలోని పులిమడుగు గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం అతడి బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో అర్కా ప్రభు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించగా పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పిడుగుపాటుతో మహిళ మృతి

ముధోల్‌: పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని గన్నో గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అప్పాల నర్మద(45), రక్మ అనే ఇద్దరు మహిళలు పత్తి చేనులో కలుపు తీస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడడంతో అప్పాల నర్మద అక్కడికక్కడే మృతి చెందింది. రుక్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో రుక్మను భైంసా ఏరియాసుపత్రికి తరలించారు. కాగా నర్మద భర్త సాయారెడ్డి ఏడేళ్ల క్రితం మృతి చెందగా ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు ట్రిపుల్‌ఐటీలో పని చేస్తున్నారు. మరొకరు టీచర్‌గా ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు.

చికిత్స పొందుతూ యువకుడు..

మందమర్రిరూరల్‌: మందమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అందుగుల పేట వద్ద నయార పెట్రోల్‌ బంకు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర వంశీ(20) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం బైక్‌పై బొక్కలగుంట నుంచి మందమర్రి వైపు వస్తుండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో సూర వంశీ మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement