ముధోల్: మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సీఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తానూర్ బైపాస్ రోడ్డు, హనుమాన్ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న దత్తాత్రి –కళావతి దంపతులు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. శనివారం రోజుమాదిరిగానే తమ ఇంటికి, గేటుకు తాళం వేసి ఉదయం కూలీకి వెళ్లారు. సాయంత్రం వచ్చి గేటు తాళం తీసి లోపలికి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండడంతో పాటు బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించగా సీఐ రవీందర్ నాయక్ అక్కడికి చేరుకొని పరి శీలించారు. దొంగలు గేటుపై నుంచి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఉంటారన్నారు. బీరువాలోని 4 మాసాల బంగారు కమ్మలను దొంగిలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఓ పత్రికలో 6 తులాల బంగారం చోరీ జరిగినట్లు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు.


