పట్టువీడని కార్మిక సంఘాలు మెట్టుదిగని యాజమాన్యం ప్రభుత్వంతో జేఏసీ చర్చలు విఫలం అర్ధరాత్రి నుంచి నిలిచిన బస్సులు ప్రత్యామ్నాయ చర్యల్లో అధికారులు
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్యలు విఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతుండడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి. సమ్మె విరమించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినా కార్మికులు తమ డిమాండ్లపై పట్టు వీడలేదు. దీంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 30శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ, కొత్త బస్సుల ప్రవేటీకరణ నిలిపివేయాలంటూ సంఘాలు డిమాండ్ చేశాయి. సాయంత్రం సచివాలయంలో అధికారుల కమిటీతో ఆర్టీసీజేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది.
ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం
ఆర్టీసీలో గతంలో జరిగిన సమ్మె అనుభవాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. మంచిర్యాల డిపోలో 148 బస్సులు ఉండగా అద్దె బస్సులు 69 వరకు ఉన్నాయి. మొత్తం డిపోలో 468 మంది ఉద్యోగులు ఉండగా డ్రైవర్లు 151 మంది, కండక్టర్లు 199 మంది ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు విధులకు దూరంగా ఉంటే ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. మొదటి రోజు తర్వాత ఎంతమంది సమ్మెలో పాల్గొంటారు.. ఏయే రూట్లలో బస్సులు నడపాలనే విషయాలపై స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అద్దె బస్సులపై విధులు నిర్వహించే డ్రైవర్లు ఉన్నారు. వీరికి తోడు ఇటీవల కాలంలో 28 మంది అవుట్‌సోర్సింగ్(ఓఎస్) డ్రైవర్లు ఉన్నారు. కారుణ్య నియామకం కింద 33 మంది కండక్టర్లు(రెగ్యులర్ కాలేదు) ఉన్నారు. మొదటి రోజు జరిగే సమ్మె తీరును బట్టి మరుసటి రోజు తాత్కాలిక కండక్టర్ల నియామకం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రద్దీ రూట్లలో రాకపోకలు..
ఆర్టీసీ బస్సుల్లో సగం అద్దె బస్సులు కావడంతో రద్దీ రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నడపాలని యాజమాన్యం యోచిస్తోంది. ప్రైవేట్ డ్రైవర్లు, కారుణ్య నియామకాల కింద విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్లు విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. చెన్నూర్, కాగజ్‌నగర్, లక్సెట్టిపేట వైపు రద్దీ మార్గాల్లో బస్సుల రాకపోకలు ఎక్కువగా సాగనున్నాయి. మరోవైపు ఆర్టీసీలో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లతోపాటు మిగిలిన ఉద్యోగులు కలిసి వస్తారని ఘంటాపథంగా సంఘాల నేతలు చెబుతున్నారు. అద్దె బస్సుల డ్రైవర్ల మద్దతు ఉందని తేల్చి చెబుతున్నారు. సమ్మె సక్సెస్‌కు సంఘాలు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యల్లో ఆర్టీసీ యాజమాన్యం తలోదారిగా వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.


