సర్పంచులకు ముగిసిన రెండోవిడత శిక్షణ
మంచిర్యాలరూరల్(హజీపూర్): పల్లెలను ప్రగతి బాటలో నిలపడం, పంచాయతీరాజ్ చట్టం, పాలనా విధివిధానా లపై సర్పంచులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండోవిడత శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో 106 మంది సర్పంచులకు ఐదు రోజులపాటు శిక్షన ఇచ్చారు. గ్రామాల్లోని వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, గ్రామ కమిటీల ఏర్పాటు, ప్రణాళికల తయారీ, హరితహారం, గ్రామ ఆదాయం పెంచుకోవడంపై జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు వివరించారు. శిక్షన పొందిన సర్పంచులు సుపరిపాలన అందించి గ్రామాలను ఆదర్శంగా నిలపాలని సూచించారు. రెండో విడత శిక్షణలో కోటపల్లి, కాసిపేట, దండేపల్లి, వేమనపల్లి, భీమిని మండలాలకు చెందిన సర్పంచులు డీఎల్‌పీవో కొమ్మెర సతీశ్, మాస్టర్ ట్రైనర్లు మోహన్, వెంకటేశ్, మహేశ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. అనంతరం శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు.
23 నుంచి మూడో విడత
మూడో విడత సర్పంచుల శిక్షణ తరగతులు ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. జన్నారం నుంచి 29, నెన్నెల నుంచి 19, బెల్లంపల్లి నుంచి 17, కన్నెపల్లి నుంచి 15 మంది, తాండూరు నంచి 15 మందితో కలిసి మొత్తం 95 మంది సర్పంచులు శిక్షణలో పాల్గొననున్నారు.
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
మంచిర్యాలరూరల్(హజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు చెందిన 106 మంది వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. కార్యక్రమంలో ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, శిక్షకులు సురేశ్, మల్లేశ్, సురేష్, రఘు పాల్గొన్నారు.


