చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
పెంబి: చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హన్మండ్లు తెలిపిన వివరాల మేరకు కడెం మండలం చిన్నబెల్లాల్‌కు చెందిన గెడాం శ్రీకాంత్ (30)కు పెంబి మండలంలోని రాంగూడకు చెందిన నీలభాయితో వివాహమైంది. పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన శ్రీకాంత్ సోమవారం సాయంత్రం బంధువుతో కలిసి మద్యం మత్తులో కడెం వాగుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. మంగళవారం జాలర్లతో వెతికించగా మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి గెడాం శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
బస్సు కిందపడి ఒకరు..
ముధోల్: బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తరోడా గ్రామానికి చెందిన పింగ్లే సాహెబ్‌రావు (26) ధర్మాబాద్ కారేగాం వాసి. నెలరోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి తరోడకు వచ్చి ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం మద్యం సేవించి ధర్మాబాద్ వెళ్లేందుకు నడుస్తున్న బస్సు ఎక్కుతున్న క్రమంలో జారి కిందపడడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలు
మందమర్రిరూరల్: హత్యాయత్నం కేసులో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నిర్మల మంగళవారం తీ ర్పునిచ్చినట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. మందమర్రి పట్టణంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఉండే కోహినూర్ దక్షిణమూర్తితో రామన్‌కాలనీకి చెందిన దసుకుంట్ల కుమారస్వామికి రెండేళ్ల క్రితం గొడవ జరిగింది. ఈక్రమంలో కుమారస్వామి అతనిపై కత్తితో దాడి చేశాడు. దక్షిణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు.


