కాక రేపుతున్న వలసలు
కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో చేరికలు
టికెట్లు ఖరారు కాకముందే పార్టీల మార్పు
మున్సిపల్ ఎన్నికల్లో మారుతున్న పరిణామాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికలకు ముందే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుల వలసలు కాక రేపుతున్నాయి. టికెట్ రాదని తెలిసి ఎవరి దారి వారు చూసుకుంటుండడంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సర్కారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పట్టణాల్లో మొదలైన అభివృద్ధి చెప్పుకుని ఓట్లు సాధించి మున్సిపాల్టీల్లో జెండా ఎగురవేయాలని ఆరాటపడుతున్న అధికార పార్టీకి సొంత నాయకులే ఏకు మేకవుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించడంలో స్థానిక నాయకత్వం విఫలం కావడం ప్రతిపక్షాలకు కలిసి వస్తోంది. ఇక అధికారికంగా అభ్యర్థుల పేర్లు ఖరారు తర్వాత ఎంతమంది పార్టీ మారుతారోనని చర్చ జరుగుతోంది. అంతేగాక.. తమకు టికెట్ దక్కని కసితో ప్రతిపక్షంతో చేతులు కలిపినా ‘హస్తం’ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో గెలిచే స్థానాలను అధికార పార్టీ కోల్పోయిందనే వాదనలు ఉన్నాయి. గ్రామాల్లో రెబల్‌గా వేసిన నాయకులతో పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు దక్కాలంటే ప్రతీ వార్డు, డివిజన్ కీలకం. అధికార పార్టీ నుంచి వలసలు ఎటు మేలు చేస్తాయోననే చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు రెబల్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు.
‘మంత్రి’ ఇలాకాలో తిప్పలే..
చెన్నూరు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మూల రాజిరెడ్డి తన అనుచర గణంతో ‘గులాబీ’ పార్టీ గూటికి చేరారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పని చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. అవసరమైతే సొంత డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో పలు వార్డుల్లో ప్రభావం చూపితే మంత్రి వివేక్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సోమవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సమక్షంలో 9వ వార్డు నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆశావహుల జాబితాలోనే తమ పేర్లు లేవని ఇటీవల ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే నాయకులు వాగ్వాదం చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక పార్టీ అభ్యర్థుల పేర్లు వెల్లడించాక అసమ్మతి నాయకులు ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది.
లోలోపల మంతనాలు
బెల్లంపల్లి పట్టణంలోనూ అధికార పార్టీ నాయకుల తీరు ఎమ్మెల్యే వినోద్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కోచోట ఇద్దరు, ముగ్గురేసి పోటీ ఉండడంతో టికెట్ దక్కని వారంతా ఏం చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. రిజర్వేషన్లు కలిసొచ్చిన వారంతా ఎలాగైనా పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఇస్తామని కొందరికి హామీలు దక్కాయి. పార్టీలో చేరి పోటీకి దిగుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో లోలోపల మంతనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టికెట్ రాకపోతే పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కార్పొరేషన్‌లో ‘చేయి’ జారుతున్న లీడర్లు
జిల్లా కేంద్రం కార్పొరేషన్‌గా మారిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు కొందరు టికెట్ల్ల పంపకంలో చేయి జారిపోతున్నారు. జిల్లా కేంద్రంలో మైనార్టీ నాయకుడు 49వ డివిజన్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన పోటీతో ముస్లిం ఓట్లు ప్రభావం అవుతాయనే చర్చ మొదలైంది. ఈయనతోపాటు 13, 55వ డివిజన్ల మాజీ కౌన్సిలర్‌తో సహా నాయకులు పార్టీ మారారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ నుంచి పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు కొందరు టికెట్ రాకపోతే రెబల్‌గా పోటికి సిద్ధమవుతున్నారు. మరోవైపు నగరం, పట్టణంలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఒక్కో డివిజన్‌లో త్రిముఖ పోటీ ఏర్పడితే జిల్లా కేంద్రంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.


