మంత్రి కుటుంబానికే పదవులు
● మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ● బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
రామకృష్ణాపూర్: గత ఎన్నికల సమయంలో చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన మంత్రి వివేక్ గెలిచిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయలేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ప్రజలకు ఉద్యోగాల హామీ ఏమో గానీ వివేక్‌కు మంత్రి పదవి, కొడుకుకు ఎంపీ పదవి, అన్న వినోద్‌కు ఎమ్మెల్యే పదవి, మరో బంధువుకు స్పీకర్ పదవులైతే వచ్చాయని విమర్శించారు. క్యాతనపల్లిలోని సుమన్ స్వగృహంలో సోమవారం నియోజకవర్గానికి చెందిన ఆయా పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో భారీగా చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ పరిశ్రమలు తీసుకొస్తానని, అగ్రికల్చరల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని, క్యాతనపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ‘కన్నీరు పెడుతున్న క్యాతనపల్లి’ అంటూ ఇటీవల తాము ఒక కరపత్రం విడుదల చేశామని, వెంటనే కొబ్బరి కాయలు కొట్టడం ప్రారంభించారని అన్నారు. క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజారమేష్, పార్టీ క్యాతనపల్లి ఇన్‌చార్జి పల్లె భూమేష్, నాయకులు మేడిపెల్లి సంపత్, జె.రవీందర్, బడికల సంపత్, సుదర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


