రేపటి నుంచి వనదేవతల జాతర
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రం మంచిర్యాల గోదావరి నదీ తీరంలో ససమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 28నుంచి 31 వరకు జాతర సాగనుంది. మహాప్రస్థానం పక్కన, సరస్వతీ శిశుమందిర్ వెనుక వైపు వాహనాల పార్కింగ్‌తోపాటు లైటింగ్ పనులు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ స్థలాలు చదును చేశారు. తాగునీటి సౌకర్యం, స్నానాలు ఆచరించేందుకు ఆకాశగంగ(కుళాయిలు) క్యూలైన్లు, టెంట్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశా రు. ఈ ఏడాది నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో భక్తులు గోదావరినదిలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
మేడారం బాటపట్టిన భక్తులు
సమ్మక్క–సారాలమ్మ భక్తులు మేడారం జాతర బాటపట్టారు. భక్తులతో మంచిర్యాల బస్‌స్టేషన్ కోలాహలంగా మారింది. జిల్లాలోని ఆరు పాయింట్ల నుంచి 369 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 25నుంచి మంచిర్యాల బస్టాండ్‌లో కొనసాగిన మేడారం ప్రత్యేక బస్సుల కౌంటర్‌ను ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి మార్చారు. ప్రత్యేక శిబిరంలో క్యూలైన్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నుంచి మేడారానికి బస్సుల రాకపోకలు మైదానం నుంచి సాగనున్నాయి. ఈ నెల 25న 9బస్సులు, 26న 8 బస్సులు నడిపించనున్నట్లు డీఎం శ్రీనివాసులు తెలిపారు.


