బెల్లంపల్లి: జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి.రాకేశ్ తెలిపారు. పట్టణంలోని హన్మాన్ బస్తీకి చెందిన మంతెన శివకుమార్ (30) హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకుమార్ ఎడమకాలు విరిగింది. ఆరునెలల క్రితం శివకుమార్ భార్య అతన్ని వదిలివెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఒంటరి జీవితం భరించలేక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మంతెన రామక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి..
బెల్లంపల్లి: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు బెల్లంపల్లి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కె.సురేశ్‌గౌడ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడు గుండు చేయించుకుని ఉన్నాడని, సుమారు 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎల్లో కలర్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడని, వివరాలు ఏమీ తెలియలేదన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని, సమాచారం తెలిసిన వారు 9948481902 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..
ఉట్నూర్‌రూరల్: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని శ్యాంపూర్‌కు చెందిన ఎం.బాబు (48) కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురికావడంతో మనస్తాపం చెందాడు. గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుని భార్య దృపద కుష్ఠు వ్యాధితో బాధపడుతోంది. ఆమెను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బీజేపీ నాయకులు కాటం రవీందర్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
భర్త మద్యం మానేయడంలేదని భార్య..
భర్త మద్యం మానేయడంలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వంకతుమ్మలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఆత్రం విమల (20) భర్త జ్ఞానేశ్వర్ తరచూ మద్యం సేవిస్తుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మద్యం మానేయాలని ఎంతచెప్పినా వినిపించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చిట్టీల పేరుతో మోసగిస్తున్న వ్యక్తి రిమాండ్
మండలంలోని నవోదయనగర్ గ్రామానికి చెందిన జావిద్ పలువురిని చిట్టీల పేరుతో మోసం చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. పూర్తి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.


