
రైలు పట్టాలపై రక్త చరిత్ర..!
● వివిధ కారణాలతో ఏటా వందలాది మరణాలు ● అనుమానాస్పద ఆత్మహత్యలు అనేకం ● గుర్తు తెలియని మృతదేహాల గుర్తింపులో జాప్యం
మంచిర్యాలక్రైం: క్షణికావేశంలో కొందరు... ఆర్థిక ఇబ్బందులతో మరి కొందరు... ఉద్యోగాలు రాలేదని, ప్రేమ విఫలమైందని... సంతానం కలగడంలేదని... కారణాలు ఏవైనా చావే శరణ్యమనుకుని క్షణికావేశంలో నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. మరికొందరు ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందుతున్నారు. ఇలా ఏడాదికి వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో హత్య చేసి రైలుకింద పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. రైలు పట్టాలపై మృతదేహాల తీరును పరిశీలిస్తుంటే ఆత్మహత్యా? హత్యా? అంతుచిక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇలా ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్న రైలు పట్టాలు రక్త చరిత్రను రాస్తున్నాయి. రైల్వే పోలీసుల పర్యవేక్షణ లేక పోవడంతోనే రైలూ పట్టాలపై నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ శాతం 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సువారే అధికంగా ఉంటున్నారు.
మృతదేహాలపై అనుమానాలెన్నో..
మంచిర్యాల జిల్లా జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 నుంచి 2024 ఏప్రిల్ వరకు 377 మంది వివిఽ ద కారణాలతో రైలు పట్టాలపై మృతి చెందారు. ఇందులో 44 మృతదేహాలు గుర్తుతెలియని వ్యక్తులవే కావడం గమనార్హం. ఎవరో.. ఎక్కడివారో.. ఎందుకు చనిపోయారో.. తెలియక పోవడంతో చేసేదేంలేక మూడురోజుల పాటు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో మృతదేహాన్ని భద్రపరుస్తున్నారు. ఎవరూ రాకపోవడంతో అనాధ శవాలు గా గుర్తించి జీఆర్‌పీ పోలీసులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నెలల తరబడి మృతుల ఆచూకీ లభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దూరప్రాంతాల వ్యక్తులెవరైనా నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా ఇతర ప్రాంతాల్లో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లి పోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి కేసులు విచారణ పేరట ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.
ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతాలు...
మంచిర్యాల జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కాగజ్‌నగర్ నుంచి మొదలుకుని తాండూర్, రేచిని, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య అధికంగా రైలు పట్టాలపై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతాల్లోని రైలు పట్టాలు ప్రజలు సంచరించే ప్రాంతాలకు సమీపంగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.
మచ్చుకు కొన్ని సంఘటనలు....
● 2023 ఆగస్టులో మంచిర్యాల శివారులోని గోదావరి సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ (25) దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ సదరు మహిళ ఆచూకీ లభించలేదు.
● 2023 జూలై 10న జైపూర్ మండలానికి చెందిన ఓ యువకుడు పెళ్లి కావడంలేదని మనస్తాపం చెంది మంచిర్యాల ఏసీసీ వెనుకాల గుర్తు తెలి యని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
● 2021 జనవరిలో మంచిర్యాల శివారులో ఒక వృద్ధుడు, యువకుడు రైలు కిందపడి మృతి చెందారు. వృద్ధుడు స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన దాసరి బాపుగా గుర్తించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. యువకుడు ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు
చాల మంది క్షణికావేశానికి గురై ఆత్మహత్యలే శరణ్యంగా భావించి బంగారు భవిష్యత్‌ను కోల్పోతున్నారు. ఇందులో ఎక్కువ శాతం 20 నుంచి 40 సంవత్సరాల వారే అధికంగా ఉంటున్నారు. ఎక్కడో ఉంటున్నారు. రైలు రాగానే ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మద్యం సేవించి మత్తులో రైలు పట్టాలపై పడుకుంటున్నారు. దీంతో శరీరాలు గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జవుతున్నాయి. వాటిని తొలగించాలన్నా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. కానీ ఉద్యోగరీత్యా తప్పదు. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి పత్రిక ప్రకటన ఇస్తున్నాం. మూడు రోజుల పాటు చూసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం.
– సుధాకర్, జీఆర్‌పీ ఎస్సై, మంచిర్యాల
రైలు కిందపడి మృతి చెందిన వారి వివరాలు
సంవత్సరం ఆత్మహత్యలు సాధారణ మరణాలు ప్రమాదవశాత్తు గుర్తు తెలియనివి
2022 75 08 43 14
2023 73 17 67 19
2024 25 07 18 11

రైలు పట్టాలపై రక్త చరిత్ర..!

రైలు పట్టాలపై రక్త చరిత్ర..!