
అక్షరాస్యత కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టాలి
భీమిని/మందమర్రిరూరల్: నిరక్షరాస్యత నిర్మూలనకు అక్షరాస్యత కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగేలా ప్రభుత్వం న్యూ ఇండియా లిట్రసీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టిందని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎస్‌ఐఈటీ) ఇన్‌చార్జి, ఫ్రొఫెసర్ డాక్టర్ రవికాంత్‌రావు అన్నారు. వయోజన విద్యాశాఖ, మంచిర్యాల సఖి, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న అక్షరాస్యతపై కుట్టు శిక్షణ కేంద్రాలను సోమవారం కన్నెపల్లి మండల కేంద్రం, మందమర్రి పట్టణంలోని శ్రీపతినగర్‌లో సందర్శించి మాట్లాడారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమాలు అధికారికంగా ముగిసినప్పటికీ జిల్లాలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాల్లో అక్షరాస్యత నేర్పడం వంటి కార్యక్రమాలు చేపట్టడంపై ఆయన వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తంను అభినందించారు. మహిళలు చదువు, ఉపాధి నైపుణ్యాన్ని నేర్చుకుంటూ జీవితంలో ఎదగాలన్నారు. 8, 9, 10 తరగతి విద్యార్థులు కూడా జిల్లా నిరక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని వంద శాతం అక్షరాస్యతగా గ్రామాలుగా తీర్చిద్దాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్, లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, కన్నెపల్లి మండల బ్యాంకు మేనేజర్ గురుమూర్తి, లయన్స్‌క్లబ్ అధ్యక్షురాలు బండ శాంకారి, డీఆర్‌పీలు సువర్ణ, ప్రకాశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.