మదనాపురం: రెక్కలొచ్చిన కొడుకు తమకు ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు.. పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని కలలు కన్నారు. కానీ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబ ఆశలను ఛిద్రం చేసింది. కళ్లముందే తిరిగిన కొడుకు మళ్లీ అమ్మా అని పిలుస్తాడని 20 రోజులుగా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు తీరని శోకమే మిగిలింది. నెలివిడి గ్రామానికి చెందిన బాలరాజు (26) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.
ప్రమాదం జరిగిందిలా..
మదనాపురం మండలం నెలివిడికి చెందిన జయన్న, మన్నెమ్మ దంపతుల కుమారుడు బాలరాజు నవంబర్ 6న రాత్రి రాములుగౌడ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మదనాపురంలోని ఊకచెట్టు వాగుపై నూతన వంతెన దాటి మట్టి రోడ్డు ఎక్కుతుండగా.. వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు అదుపుతప్పి సుమారు 20 అడుగుల లోతులో పడిపోయాయి. ఈ ప్రమాదంలో బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆశలు ఆవిరి.. కుటుంబంలో విషాదం
తీవ్రంగా గాయపడిన బాలరాజును తొలుత మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరో పది రోజుల పాటు మృత్యువుతో పోరాడినా ప్రాణాలు దక్కలేదు. కొడుకు తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూసిన తల్లిదండ్రులకు అతడి మరణవార్త పిడుగులా మారింది.
రక్షణ కవచాలేవీ?
ఊకచెట్టు వాగుపై నిర్మించిన కొత్త వంతెన వద్ద మట్టి రోడ్డు అంచులకు క్రాష్ బారియర్లు, రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటే ఈ విషాదం జరిగేది కాదేమోనని ఆవేదన చెందుతున్నారు. బాలరాజు మృతితో నెలివిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడిన యువకుడు
20 రోజులుగా చికిత్స పొందుతూ నిమ్స్‌లో మృతి
చేతికొచ్చిన కొడుకును కోల్పోయి
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు


