● టార్చ్ ర్యాలీని విజయవంతం చేయాలి
● అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ ఖ్యాతి దేశవ్యాప్తంగా మారుమోగేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఖేలో ఇండియా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీల్లో భాగంగా నిర్వహించనున్న టార్చ్ ర్యాలీని ప్రతి జిల్లాలో విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా వేదికల్లో మౌలిక సదుపాయాలు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచాలని, క్రీడాకారులు, సహాయక సిబ్బందికి భద్రత, వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో క్రీడా వేదికలను పరిశీలించి అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు ఖేలో ఇండియా క్రీడలు వేదిక కావాలని ఆకాంక్షించారు. సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్‌ఓ నిర్మల, డీవైఎస్‌ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.


