కావేరమ్మపేట నుంచి.. వెండితెరకు! | - | Sakshi
Sakshi News home page

కావేరమ్మపేట నుంచి.. వెండితెరకు!

Nov 29 2026 2:41 PM | Updated on Nov 29 2026 2:41 PM

● ‘ఆకాశంలో ఒక తార’తో రచయితగా గుర్తింపు పొందిన వసంత్‌ జుర్రు

జడ్చర్ల టౌన్‌: చిన్ననాటి సినిమా కలను నిజం చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. షార్ట్‌ఫిలింలతో మొదలైన ప్రయాణం.. కో–డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ స్థాయి నుంచి రచయితగా ఎదిగేలా చేసింది. దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక నటించిన ‘ఆకాశంలో ఒక తార’ ఇటీవల విడుదలైన విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రానికి రచయితగా, అదనపు స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వహించిన ప్రశంసలు అందుకుంటున్నాడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన వసంత్‌ జుర్రు. ఆయన సినీ ప్రయాణం, అనుభవాలు ఆయన మాటల్లోనే..

సినిమాపై ఆసక్తి అలా మొదలైంది..

చిన్నతనంలో ‘సాగరసంగమం’ సినిమా చూసి ఎలాగైనా సినీ రంగంలో రాణించాలని నిర్ణయించుకున్నాను. తెలుగు విశ్వవిద్యాలయంలో స్క్రీన్‌ప్లే రైటింగ్‌, నిర్మాణరంగంలో శిక్షణ పొందాను. శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివిన తర్వాత విప్రోలో ఉద్యోగం వచ్చింది. మూడేళ్లు పనిచేశాను. అప్పటికే ‘వెయ్యి రూపాయలు’, ‘గీతలు’ అనే రెండు షార్ట్‌ఫిలింలు రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. వాటిని చూసిన మా గురువు పరుచూరి గోపాలకృష్ణ.. దర్శకుడు చిన్నికృష్ణకు పరిచయం చేశారు. దీంతో సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పాను.

అసురతో తొలి విజయం..

నిర్మాత ధర్మేంద్ర కాకరాల ప్రోత్సాహంతో విజయకృష్ణ దర్శకత్వంలో నారా రోహిత్‌ నటించిన ‘మదరాసి’ సినిమాకు కో–డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత అదే దర్శకుడి ‘అసుర’ చిత్రానికి కో–డైరెక్టర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాతో తొలి విజయం అందుకున్నాను. అనంతరం ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలకు పనిచేశాను. ‘దయ’ వెబ్‌సిరీస్‌, ‘మృత్యుంజయ’ చిత్రాలకు రచయితగా వ్యవహరించాను.

రచయితగా.. దర్శకుడిగా ఎదగాలనుంది

ప్రస్తుతం దర్శకులు విరించి వర్మ, ‘రణబాలి’ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌తో సినిమాలకు రచయితగా పనిచేస్తున్నాను. భవిష్యత్తులో రచయితగా, దర్శకుడిగా మరింతగా రాణించాలనుంది. నా పుట్టిన ఊరు కావేరమ్మపేటతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఔత్సాహికులను ప్రోత్సహించి, వారికి సినీ రంగంలో అవకాశాలు కల్పించాలన్నది నా ఆకాంక్ష.

వసంత్‌ సినీ ప్రస్థానం

2011: ‘వెయ్యి రూపాయలు’, ‘గీతలు’ షార్ట్‌ఫిలింలకు రచన, దర్శకత్వం

2015: ‘అసుర’ – కో–డైరెక్టర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌

2020: ‘కేరాఫ్‌ కంచరపాలెం’కు కన్సల్టెంట్‌, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌

2023: ‘దయ’ వెబ్‌సిరీస్‌ – రచన, అదనపు స్క్రీన్‌ప్లే

2024: వీరాంజనేయులు విహారయత్ర చిత్రానికి స్క్రిప్ట్‌ కన్సల్టెంట్‌

2025: ‘మగాడు’, ‘మందరవనం’ – రచన, స్క్రిప్ట్‌ కన్సల్టెంట్‌

2026: ‘మృత్యుంజయ’, ‘ఆకాశంలో ఒక తార’ రచయితగా గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement