జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పంచాయతీ కార్యదర్శులపై యాప్‌ల నిర్వహణ, రికార్డుల నమోదు, గ్రామసభల నిర్వహణ భారం పెరుగుతోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ పథకాల అమలు, ఇతర విధులతో సతమతమవుతున్న తమకు ఉదయం 9 గంటలకే అటెండెన్స్ నమోదు చేయాలనే నిబంధన మరింత ఒత్తిడికి గురిచేస్తోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉదయం 11 గంటల వరకు ఉన్న వెసులుబాటును వారం రోజుల క్రితం తిరిగి 9 గంటలకు మార్చడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అటెండెన్స్ విషయంలో కనీసం ఉదయం 10 గంటల వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
యాప్‌లతో ఉక్కిరిబిక్కిరి
డీఎస్‌ఆర్ యాప్‌తోపాటు ఇందిరమ్మ ఇళ్ల యాప్, ఎస్‌బీఎం గ్రామీణ్, జీపీ స్వాప్, జీపీడీపీ, పీఎసీపీ మానిటరింగ్, నిర్ణయ్, మిషన్ భగీరథ, ఎం–యాక్షన్, మేరీ పంచాయతీ, ఐఎఫ్‌ఎంఐఎస్, చేయూత తదితర యాప్‌లలో పనులు నమోదు చేయాల్సి వస్తోందని కార్యదర్శులు చెబుతున్నారు. వీటికి అదనంగా గ్రామ స్వరాజ్ ఆన్‌లైన్ పనులు, చెత్త వేర్వేరు సేకరణ, ట్రాక్టర్ల నిర్వహణ, కార్యాలయంలో 36 రికార్డుల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటోందని పేర్కొంటున్నారు. సర్ ప్రక్రియ, పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, వీబీజీ రామ్ జీ తీర్మానాలు, ఇంకుడు గుంతలు, ఊర కుంటలు, పంట కుంటల లక్ష్యాల సాధన, కుక్కలు, కోతులు, మరుగుదొడ్ల సర్వేలు వంటి పనులు కూడా చేయాల్సి వస్తోందని వివరిస్తున్నారు.
తరచూ గ్రామసభల నిర్వహణ
గతంలో ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించే గ్రామసభలు ప్రస్తుతం వారానికి రెండు నుంచి నాలుగుసార్లు నిర్వహించాల్సి వస్తోందని కార్యదర్శులు అంటున్నారు. జీపీ స్వాప్, జీపీడీపీ, వీబీజీ రామ్ జీ, అంబేడ్కర్ జయంతి, గాంధీ జయంతి, పర్యావరణం, మహిళా గ్రామసభలు తదితర కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వాటి వివరాలను యాప్‌లలో నమోదు చేయాల్సి ఉంటోందని చెబుతున్నారు. గ్రామసభల నిర్వహణకు కోరం అవసరమైనప్పటికీ, అధికారుల ఒత్తిడితో సభలు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
423 గ్రామపంచాయతీలు.. 401 కార్యదర్శులు
మహబూబ్‌నగర్ జిల్లాలో 16 మండలాల పరిధిలో 423 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఆరు లక్షలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామపంచాయతీలకు 401 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో మిగిలిన పంచాయతీల్లో ఇన్‌చార్జీలతో పనులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరతకు తోడు పెరిగిన విధులు, యాప్‌ల నిర్వహణతో పని ఒత్తిడి అధికమవుతోందని కార్యదర్శులు పేర్కొంటున్నారు.
● గతంలో అటెండెన్స్ నమోదు చేసుకునేందుకు ఉదయం 11 గంటల వరకు వెసులుబాటు కల్పించారని, ప్రస్తుతం మళ్లీ 9 గంటల నిబంధన అమలు చేస్తున్నారని చెబుతున్నారు. సమయానికి అటెండెన్స్ నమోదు చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని, దీంతో హడావుడిగా కార్యాలయాలకు చేరుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇటీవల చిన్నచింతకుంటలో విధులు నిర్వహిస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటెండెన్స్ సమయంపై వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
కార్యాలయంలో 36 రికార్డుల నిర్వహణ
అదనంగా పలు యాప్‌లు.. తరచూ గ్రామసభలు
ఉదయం 9 గంటలకే
డీఎస్‌ఆర్ యాప్‌లో అటెండెన్స్
10 గంటల వరకు వెసులుబాటు కల్పించాలని సంఘం డిమాండ్


