పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా?

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

అడ్డాకుల: పాలమూరు రైతులకు కృష్ణా జలాల వినియోగంలో అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. కందూర్‌ పెద్దవాగుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మూసాపేట మండలం మహ్మదుస్సేన్‌పల్లి దిండు వద్ద మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. నిజాలాపూర్‌, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి, గౌరిదేవిపల్లి మీదుగా కందూర్‌ చెక్‌డ్యాం వరకు యాత్ర కొనసాగింది. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కందూర్‌ శివారులో రైతులను ఉద్దేశించి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పానికి తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. పాలమూరులో పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తుంగభద్ర జలాల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని, ఆర్డీఎస్‌ ఆయకట్టుకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాల నుంచి తగిన నీరు అందడం లేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లుగా పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ఎండింది

కేసీఆర్‌ హయాంలో కందూర్‌ పెద్దవాగు, ఊకచెట్టు వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించి నీటి నిల్వలను పెంచామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దీంతో వేలాది బోర్లు రీచార్జ్‌ అయ్యాయని, దేవరకద్ర నియోజకవర్గంలో ఎనిమిదేళ్లపాటు కృష్ణా జలాలను పారించామని పేర్కొన్నారు. సరళాసాగర్‌ ప్రాజెక్టును కూడా కృష్ణా నీటితో నింపామని తెలిపారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్లే వానాకాలంలోనూ చెక్‌డ్యాంలు ఎండిపోయాయని విమర్శించారు. పెద్దవాగుకు వెంటనే కృష్ణా జలాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సందర్భంగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనర్సింహ యాదవ్‌, జెట్టి నర్సింహారెడ్డి, సర్పంచులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శలు

రైతులతో కలిసి పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement