పాలమూరు పచ్చబడ్డాకే డిండి ప్రాజెక్టుకు నీరు | - | Sakshi
Sakshi News home page

పాలమూరు పచ్చబడ్డాకే డిండి ప్రాజెక్టుకు నీరు

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

జడ్చర్ల: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో పూర్తయి, కాలువల ద్వారా పాలమూరు బీడు భూములకు సాగునీరు అందిన తర్వాతే డిండి ప్రాజెక్టు, ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులపై ముందుకెళ్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోని లలితాంబిక తపోవనంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా కరివెన రిజర్వాయర్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఉదండాపూర్‌, లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేసి నీటిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులకు పరిపాలనా అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వెల్లడించారు. ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలన్నారు. రిజర్వాయర్లలోకి వచ్చే నీటి పరిమాణం, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత, పాలమూరు జిల్లాకు అవసరమైన నీటి పరిమాణంపై స్పష్టత వచ్చిన తర్వాతే మిగులు జలాల లభ్యతపై అంచనాకు రావచ్చని పేర్కొన్నారు. పాలమూరు అవసరాలు తీరిన తర్వాత మిగులు జలాలను ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాకు అందించేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని, అవి పూర్తయితే పాలమూరు, నల్లగొండ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలంతా రాష్ట్ర ప్రయోజనాలతో పాటు వెనుకబడిన పాలమూరు జిల్లా ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్‌ మంత్రికి ప్రజల ఆకాంక్షలను వివరించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అపోహలకు తావివ్వకుండా సహనం, సంయమనంతో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని యెన్నం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement