స్పోర్ట్స్ స్కూల్‌కు వేళాయె
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో రాబోయే విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్‌ఎస్ హకీంపేటతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 2026– 27 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వారికి 4వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలోని హకీంపేటతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉండగా ప్రతి స్కూల్‌లో 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలను, హన్మకొండ పాఠశాలలో 40 మంది బాలురు, 40 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చోటు దొరికితే అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని పలువురు క్రీడా నిపుణులు చెబుతున్నారు.
కావాల్సిన ధ్రువపత్రాలు
స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలకు విద్యార్థులు పలు ఽధ్రువీకరణ పత్రాలతో రావాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు, 4వ తరగతి చదువుతున్న సర్టిఫికెట్, వయస్సు ధ్రువీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్థులు 8 నుంచి 9 ఏళ్ల మధ్య (01.09.2017 నుంచి 31.08.2018 మధ్య పుట్టిన వారు) అర్హులు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంది.
శారీరక సామర్థ్య పరీక్షలు
విద్యార్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్ 800 మీటర్లు, 6x10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ వంటివి చూస్తారు.
మూడంచెల్లో ఎంపికలు..
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మూడంచెల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు మండల స్థాయి, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, ఏప్రిల్ 27 తేదీ నుంచి మే 1 వరకు రాష్ట్రస్థాయిలో సెలక్షన్స్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ మే 13, 14 తేదీల్లో, జూన్ 12న ఎంపికై న విద్యార్థులు ఆయా స్పోర్ట్స్ పాఠశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఎవరైతే ఎంపికవుతారో వారికి స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, యోగా వంటి క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు.
హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్,హన్మకొండలో క్రీడా పాఠశాలలు
4వ తరగతిలో విద్యార్థులకు ప్రవేశాలు
ప్రతి పాఠశాలలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం
ఈ నెల 13 నుంచి మూడంచెల్లోఎంపికలు
ప్రారంభమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
స్పోర్ట్స్ స్కూల్‌కు వేళాయె


