విద్యుదాఘాతంతో రైతు మృతి
దామరగిద్ద: వ్యవసాయ పొలంలో బోరు మోటార్‌కు మరమ్మతు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని విఠలాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి నర్సప్ప(60) శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మోటార్ స్టాటర్ ఫీజులు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అరుణ్ తెలిపారు. మృతదేహానికి శనివారం పోర్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు.
రైలు కిందపడిగుర్తుతెలియని వ్యక్తి మృతి
జడ్చర్ల: జడ్చర్ల, గొల్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి(48) మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. రైలులో ప్రయాణిస్తూ లేదా రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
కృష్ణానదిలో దూకియువకుడి ఆత్మహత్య
గద్వాల క్రైం: మనస్తాపంతో కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఏఎస్‌ఐ రఘునాథం తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన రోహిత్ (24) కొన్ని రోజుల నుంచి గద్వాల మండలంలోని రేకులపల్లిలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. రెండు నెలల నుంచి నాచారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలికతో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయమై యువకుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుడి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి బాలికతో మాట్లాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మందలించారు. ఈ క్రమంలో మృతుడి తల్లిదండ్రులు రేఖ, రాజు కుమారుడి ప్రవర్తనలో మార్పు తేవడానికి రేకులపల్లిలోని తాత ఏబన్న ఇంట్లో 20 రోజుల క్రితం విడిచి వెళ్లారు. ఈ నెల 23న బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు సైతం గ్రామానికి వచ్చారు. అదే రోజు సాయంత్రం నుంచి రోహిత్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుమారుడు ఆచూకీ కోసం బంధవులు, స్నేహితులను వాకబు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 25న రోహిత్ కనబడడం లేదని రూరల్ పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే శనివారం ఉదయం నదిలో చేపల కోసం వెళ్లిన మత్స్యకారులకు మృతదేహం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా రోహిత్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తల్లి రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
మద్యం మత్తులోభార్యను చంపిన భర్త
తెలకపల్లి: మద్యం మత్తులో భార్యను రాడ్డుతో భర్త కొట్టి చంపిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాలు.. బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన బంగారమ్మ(46) తెలకపల్లి మండలం లక్నారం గ్రామానికి చెందిన మన్యం శ్రీనుకు 26 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీను మద్యం తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో భార్యపై అల్యూమినియం రాడ్డుతో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. మృతురాలి అన్న అకారపు వెంకటయ్య శనివారం పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేరుశనగ క్వింటాల్ రూ.10,119
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.10,119, కనిష్టంగా రూ.5,255 ధరలు లభించాయి. అలాగే కందులకు గరిష్టంగా రూ.7,367, కనిష్టంగా రూ.6,389, మినుములు గరిష్టంగా రూ.7,879, కనిష్టంగా రూ.7,760, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,854, కనిష్టంగా రూ.1,781, పత్తి గరిష్టంగా రూ.6,129, కనిష్టంగా రూ.4,029, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.2,389, ఉలువలు సరాసరిగా రూ.4,301, జొన్నలు రూ.5,230 చొప్పున వచ్చాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన టెండర్లలో కందులు క్వింటాల్ రూ.7,259, ఆముదాలు రూ.5,819 ఒకే ధరలు పలికాయి. సీజన్ లేకపోవడంతో మార్కెట్‌కు తక్కువగా కందులు, ఆముదాలు అమ్మకానికి వచ్చాయి.
విద్యుదాఘాతంతో రైతు మృతి


