నేటినుంచి అలివేలుమంగ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి అలివేలుమంగ బ్రహ్మోత్సవాలు

Mar 1 2026 8:16 AM | Updated on Mar 1 2026 8:16 AM

నేటిన

నేటినుంచి అలివేలుమంగ బ్రహ్మోత్సవాలు

అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం రద్దు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు దేవస్థానం నిత్య కల్యాణం.. పచ్చతోరణంగా భాసిల్లుతుంది. కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నది ఈ పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన్యంకొండ గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరిగిన నెల రోజులకు దిగువకొండ వద్ద వెలసిన అలివేలుమంగతాయారు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం 3వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. ఈసారి చంద్రగ్రహణం కారణంగా రద్దు చేశారు. అదేరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి ఆలయం మూసివేస్తారు. 9 గంటల తర్వాత గరుడవాహన సేవ, రథోత్సవం యథావిధిగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు. అలాగే అదేరోజు రాత్రి అమ్మవారి విమాన రథోత్సవం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవ విశేషోత్సవాలు..

మన్యంకొండ శ్రీఅలివేలుమంగతాయారు బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు అంకురార్పరణం పూజా కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సోమవారం ధ్వజారోహణం, దేవతాహ్వానం, మంగళవారం రాత్రి 12 గంటలకు విమాన రథోత్సవం, గరుడ వాహన సేవ, 4న అశ్వవాహన సేవ, 5న పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృతస్నానం, నాకబలి (నాగవెల్లి) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

నేటినుంచి అలివేలుమంగ బ్రహ్మోత్సవాలు 1
1/1

నేటినుంచి అలివేలుమంగ బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement