చీడపీడల నివారణకు సమతుల్య ఎరువులు
అలంపూర్: ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యం ముఖ్యమైందని అలంపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్‌రెడ్డి రైతులకు సూచించారు. ఆహార ఉత్పత్తిలో సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాల్సిన అవశ్యకత నెలకొందని వివరించారు.
సమతుల్య ఎరువుల వాడకం :
పైరుకు కావాల్సిన పోషకాలు ఎక్కువ.. తక్కువ కాకుండా అవసరమైన మేరకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా అందించడాన్ని సమతుల ఎరువుల వాడకం అంటారు. కనుక భూసార పరీక్షల ఆధారంగా సిఫారుసు చేసిన ఎరువుల మోతాదులను వాడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
చీడపీడలను అరికట్టంలో పోషకాల పాత్ర:
రసాయన ఎరువుల వాడకానికి చీడపీడల ఉధృతానికి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికి సమతుల, సమగ్ర ఎరువుల వాడకం ద్వార పరోక్షంగా మొక్క చీడపీడలను నిలవరించి, శక్తి పొందుతుంది.
నత్రజని :
పురుగులు పంటపై దాడి చేసి నష్టం కలిగించడానికి నత్రజని వాడకానికి సంబంధం కనిపిస్తోంది. నత్రజని అధికంగా వేసినప్పుడు మొక్క ఏపుగా పెరిగి శాఖీయోత్పత్తి బాగా జరిగి ఆకులు, కాడలు బిరుసుతనం కోల్పోయి మెత్తగా తయారై పురుగులు తినడానికి అనువుగా ఉంటుంది. త్వరగా ఆకులు రావడానికి నత్రజని తోడ్పడుతుంది. అనేక పైర్లపై జరిగిన పరిశోధనల్లో సిఫార్సుకు చేయబడిన మోతాదుకు మించి నత్రజని వాడకం వలన పురుగుల బెడద ఎక్కువైనట్లు రుజువైంది. నత్రజని నెమ్మదిగా అందుబాటులోకి రావడానికి యూరియాను వేపపిండితో కలిపి వేయాలి. లేదా నిమిన్ వంటి వేప సంబంధిత కలిపి వాడవచ్చు.
భాస్వరం:
చీడపీడల నివారణలో దీని ప్రభావం పరోక్షంగా ప్రముఖ పాత్ర వహిస్తోంది. అధిక నత్రజని వలన కలిగే దుష్ప్రయోజనాలను భాస్వరం తగ్గిస్తోంది. నత్రజని, భాస్వరం పూర్తిస్థాయిలో సమతుల్యంగా ఉన్నప్పుడు మొక్క రెండింటిని సమతుల్యంగా వినియోగించుకుంటుంది. మొక్క తొలిదశలో వేర్లు బాగా వృద్ధి చెందడానికి నేల నుంచి పోషకాలను బాగ తీసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
పొటాష్ :
చీడపీడల యాజమాన్యంలో పోటాష్ కీలక పాత్ర పోషిస్తోంది. తగినంత పోటాష్ అందించినప్పుడు మొక్కలో కొన్ని రకాల ఫినాలిక్ కాంపౌడ్స్ తయారై రక్షణగా ఉంటాయి. కణకవచం (సెల్‌వాల్) గట్టిగా తయారై దండెత్తే పురుగులకు అడ్డుగోడగా నిలుస్తుంది. వరి పైరులో చీడపీడలపై అధిక ప్రభావం చూపి సమర్థవంతంగా ఆరికడుతుంది. బాక్టీరియా బూజు సంబంధమైన తెగుళ్లను 70 శాతానికిపైగా ఆరికడుతుంది. పురుగులు, మైట్స్ దాడి నుంచి 60 శాతానికిపైగా రక్షింపబడుతుంది. నెమటోడ్స్, వైరస్‌లు సైతం అధిక భాగంలో తగ్గుతాయి. చెరుకు పైరుకు తగినంత పొటాష్ వేసినప్పుడు పొలుసు పురుగు(స్కేల్ ఇన్‌సెక్ట్స్), పత్తిలో ముక్కు పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. టమాట, మిరప, వంకాయ, బంగాలదుంప వంటి కూరగాయాల పైర్లకు తగింనత పొటాష్ పోషకాన్ని అందించినప్పుడు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది.
సమగ్ర ఎరువుల వాడకం
రసాయన, సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా తగిన రీతిలో పైర్లకు పోషకాలు అందించడాన్ని సమగ్ర ఎరువుల వాడకం అంటారు. పైరుకు సిఫార్సు చేసిన పోషక మోతాదులో మూడింట రెండు వంతులు రసాయన ఎరువుల ద్వారా ఒక వంతు సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించినప్పుడు దీర్ఘకాలం పాటు భూసారం, ఫలదత, నేల ఆరోగ్యం కాపాడుతూ.. అధిక దిగుబడి పొందవచ్చు. జీవన ఎరువులు గాలి నుంచి నత్రజని, నేల నుంచి భాస్వరం అందించడానికి దోహదపడటమే కాక మొక్కలకు కావాల్సిన హార్మోన్లు, ఎంజైములు, అందించడానికి రసాయన ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించుకోవడానికి తోడ్పడతాయి.
పాడి–పంట
చీడపీడల నివారణకు సమతుల్య ఎరువులు


