పండ్లకు భలే గిరాకీ
● రంజాన్ ఉసవాస దీక్షలతో పెరిగిన వినియోగం
● రిటైల్‌గా జోరందుకున్న వ్యాపారం
స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ మాసంలో పండ్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. మిగతా రోజుల కంటే ఈ మాసంలో పండ్ల వినియోగం అధికంగా ఉండడంతో ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ద్రాక్ష పండ్లు అయితే కిలో రూ.140 నుంచి రూ.160 వరకు విక్రయస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ద్రాక్ష పండ్ల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. రంజాన్ మాసంలో ఎక్కువగా వినియోగించే కర్బూజ (పుచ్చకాయ) పండు కిలో రూ.30 నుంచి రూ.40 విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. అరటి పండ్లు డజన్ ధర గత కొన్ని రోజుల నుంచి రూ.5–10 వరకు పెరిగింది. రూ.20– 25 ఉన్న యాపిల్ రూ.30– 35 వరకు, ఆరెంజ్ పండ్లు డజన్ ప్రకారం అమ్ముతున్నారు. యాపిల్, కర్బూజ, పుచ్చకాయలు, ఫైనాపిల్, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, అరటి, సపోట వంటి పండ్ల వినియోగం పెరగడంతో వీటి ధరల్లో రోజురోజుకు మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తారు విందులకు భారీ ఎత్తున పండ్లు అవసరమవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని పండ్ల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యాపారమే ప్రధానం అనే రీతిలో పండ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, న్యూటౌన్, క్లాక్‌టవర్, అంబేడ్కర్ చౌరస్తా, పద్మావతికాలనీతోపాటు ఇతర ప్రాంతాల్లో పండ్ల స్టాళ్లను ఏర్పాటు చేశారు.
అందుబాటులో ఉండాలి..
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈసారి పండ్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. పెరిగిన ధరలతో పండ్లను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. మధ్య తరగతి ప్రజలకు పండ్ల ధరలు అందుబాటులో ఉంటే బాగుంటుంది.
– మహ్మద్ నజీబ్ అహ్మద్, మహబూబ్‌నగర్


