ఆటో కొనుకునేందుకు తెచ్చిన రూ.3 లక్షలు బూడిద
జడ్చర్ల టౌన్: ఆటో కొనుకునేందుకు తెచ్చిన అప్పు రూ.3 లక్షలు ఇంట్లో పెట్టగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ మంటలు చెలరేగి నగదు కాలిపోయిన ఘటన శుక్రవారం సాయంత్రం మండలంలోని నేలబండతండాలోని ఓ ఇంట్లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తండాకు చెందిన జర్పులావత్ లాల్య ఇంట్లో ఉన్న ఫ్రిజ్ వద్ద విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న బీరువా, ఇతర వస్తువులకు వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల వాళ్లు గమనించి మంటలు ఆర్పారు. ఆటో కొనుగోలు చేసేందుకు ఇతరుల వద్ద అప్పు తీసుకొచ్చి ఇంట్లో ఉంచిన రూ.3.06 లక్షల నగదు కాలిపోయినట్ల బాధితుడు లాల్య వాపోయాడు. ఆటో కొనుగోలు చేసేందుకు ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఇతరుల వద్ద మరికొంత అప్పు తీసుకొచ్చేందుకు తాను బయటకు రాగా.. ఈ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నాడు. విషయం తెలియగానే సర్పంచ్ జయమ్మ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నేలబండతండాలోని
ఓ ఇంట్లో విద్యుత్‌షార్ట్ సర్క్యూట్


