ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
● కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి హఠాన్మరణం
● మహబూబ్‌నగర్ జిల్లా పెద్దర్పల్లిలో విషాదం
హన్వాడ: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లి సైతం హఠాన్మరణం చెందింది. వివరాలిలా.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పెద్దర్పల్లి గ్రామానికి చెందిన దెబ్బడి కృష్ణయ్య(40) గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కృష్ణయ్య కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చే క్రమంలో కలహాలు చోటుచేసుకున్నాయి. దీంతో కృష్ణయ్య గురువారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే అందరూ గాఢనిద్రలో ఉండగా కృష్ణయ్య ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణయ్య తల్లి బాబమ్మ(80) ఉదయం కొడుకు మరణాన్ని చూసి తట్టుకోలేక అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబీకులు వెంటనే బాబమ్మను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేరోజు తల్లీకొడుకు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణయ్యకు భార్య లక్ష్మితోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. బాబమ్మకు కృష్ణయ్యతోపాటు మరో కుమారుడు ఉన్నారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. బాధిత కుటుంబానికి గ్రామ సర్పంచ్ దీప్తి భర్త రఘురాంగౌడ్ అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


