భక్తుల ఇంటికే బంగారం..
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు.
● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్‌లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tgsrtclogistics. co.in వెబ్‌సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఆర్టీసీ వినూత్న కార్యక్రమం
రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు..
ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ
వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం
భక్తుల ఇంటికే బంగారం..
భక్తుల ఇంటికే బంగారం..


