నేటి నుంచి జములమ్మ బ్రహ్మోత్సవాలు
రేపు మెట్టినిల్లుకు..
1న పౌర్ణమి వేడుకలు
●
విద్యుదీపాల వెలుగులో
అమ్మవారి ఆలయ సముదాయం
గద్వాల న్యూటౌన్: భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జములమ్మ, పరుశరామస్వామి వారి ఆలయ సముదాయాలను వివిధ రకాల పుష్పాలు, విద్యుదీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) మాగశుద్ధ పౌర్ణమి నుంచి ఏరువాక పౌర్ణమి (జూన్ 29) వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.
నేడు పుట్టింటినుంచి బయలుదేరనున్న అమ్మవారు
● గద్వాల మండలంలోని కృష్ణానది దివి గ్రామమైన గుర్రంగడ్డ అమ్మవారి పుట్టినిల్లుగా చరిత్ర చెబుతోంది. అక్కడున్న ఆలయం నుంచి ప్రతి ఏటా అమ్మవారిని మాగశుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే మంగళవారం మెట్టినిల్లు అయిన జమ్మిచేడులోని ఆలయానికి ఆహ్వానించేందుకు ఎద్దుల బండి బయలు దేరుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు గుర్రంగడ్డ గ్రామానికి బండి బయలుదేరనుంది.
ఫిబ్రవరి 1న పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక పూజలు చేసి అలంకరిస్తారు. అదేరోజు సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించనున్నారు. వేడుకలకు నడిగడ్డ ప్రాంతంతో పాటు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
గుర్రంగడ్డ గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న జములమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, అమ్మవారిని ఆహ్వానించి ఎద్దుల బండిపై తీసుకొస్తారు. బుధవారం తెల్లవారుజామున బయలుదేరి సాయంత్రం 6 గంటల వరకు మెట్టినిల్లు అయిన జమ్మిచేడుకు చేరుకుంటారు.
నేటి నుంచి జములమ్మ బ్రహ్మోత్సవాలు


