
ఇంటి అనుమతులు ఇవ్వాలని వృద్ధురాలు వేడుకోలు
మద్దూరు: ఇంటి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్‌తో పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన సంఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నడిమింటి పద్మమ్మకు చెందిన ఇంటిని అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్‌కు విక్రయించింది. ఈ క్రమంలో ఆంజనేయులుగౌడ్ పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పద్మమ్మ పెద్దకుమారుడు రాములుగౌడ్ నాకు తెలియకుండా మా అమ్మ ఇంటిని ఎలా అమ్ముతుందని కోర్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇవ్వకుండా ఉంచాడు. ఇంటిని కొనుగోలు చేసిన ఆంజనేయులుగౌడ్ పద్మమ్మపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఆమె పెట్రోల్ తీసుకొని పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. అనుమతి ఇవ్వకుంటే పెట్రోల్ పోసుకొని చనిపోతానని బెదిరించింది. దీంతో పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని వృద్ధురాలికి నచ్చజెప్పి తీసుకెళ్లారు. ఈ స్థలం కోర్డులో వివాదం ఉండటంతో అనుమతి ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి సత్తయ్య వివరించారు.
పెట్రోల్ బాటిల్‌తో పంచాయతీ
కార్యాలయానికి వచ్చిన వైనం