Telangana Crime News: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత బలన్మరణం!
Sakshi News home page

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత బలన్మరణం!

Published Tue, Dec 26 2023 12:48 AM

- - Sakshi

కల్వకుర్తి టౌన్‌: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలన్మరణానికి పాల్పడిన ఘటన కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌, కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. పట్టణంలోని హనుమాన్‌ నగర్‌కు వెళ్లే దారిలో నివాసముండే ఫిరోజ్‌కు హైదరాబాద్‌కు చెందిన రజియా (30)తో మూడేళ్ల కిందట వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం రజియాపై అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి.

పలుమార్లు పెద్దలు నచ్చజెప్పినా వారి తీరు మారలేదు. దీంతో మనస్తాపానికి గురైన రజియా.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకొంది. గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేసి, పోలీసులతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆమెను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

రజియా ఆత్మహత్యకు భర్త ఫిరోజ్‌తో పాటు అతడి తల్లిదండ్రుల వేధింపులే కారణమని మృతురాలి తల్లి బీబీ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. మృతురాలికి మూడేళ్ల బాబుతో పాటు ఏడాది వయసు గల మరో బాబు ఉన్నారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చికిత్స పొందుతూ యువకుడు..
భూత్పూర్‌:
భూత్పూర్‌ మండలంలోని కర్వెనకు చెందిన హన్మంత్‌రెడ్డి (20) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. ఇటీవల హన్మంత్‌రెడ్డి బైక్‌పై వెళ్తుండగా.. కర్వెన సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది.

ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసినట్లు వివరించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ వెల్లడించారు.

పురుగు మందు తాగి మహిళ బలవన్మరణం
చారకొండ:
పురుగు మందు తాగి ఓ మహిళ అత్మహత్యకు పాల్పడిన ఘటన చారకొండ మండలం సారంబండతండాలో చోటుచేసుకుంది.హెడ్‌కానిస్టేబుల్‌ నాగయ్య వివరాల మేరకు.. సారంబడ తండాకు చెందిన వడ్త్యావత్‌ బుజ్జి (48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది.

గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

ముఖ్య గమని​క:
​​​​​​​ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చెరువులో పడి వ్యక్తి మృతి
భూత్పూర్‌: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భూత్పూర్‌ మున్సిపాలిటీలోని సిద్ధాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. వికారాబాద్‌ జిల్లా మరుపల్లి మండలం వీర్లపల్లికి చెందిన ఎన్‌.రాములు (35) తన భార్య లలితతో కలిసి ఎనిమిదేళ్లుగా భూత్పూర్‌ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌కు చెందిన రమేష్‌ వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు.

పంటల సాగు నిమిత్తం సిద్ధాయిపల్లి రాందాస్‌ చెరువులో విద్యుత్‌ మోటార్‌ బిగించి నీటిని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పొలానికి నీరు పెట్టడానికి రాములు వెళ్లగా.. మోటార్‌ పనిచేయలేదు. దీంతో చెరువులో నుంచి మోటార్‌ను బయటికి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెక్‌డ్యాంలోయువకుడి గల్లంతు
కోస్గి: చెక్‌డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతైన ఘటన కోస్గి మండలం ముశ్రీఫా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ముశ్రీఫాకు చెందిన బుడగజంగం వెంకటయ్య (32), శ్రీనివాస్‌ సోమవారం గ్రామ సమీపంలోని చెక్‌డ్యాంలో చేపల వేటకు వెళ్లారు.

వాగు లోతు గమనించకుండా నీటిలోకి దిగిన వెంకటయ్యకు ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అతడి కోసం శ్రీనివాస్‌ గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయాన్ని గ్రామస్తులతో పాటు పోలీసులకు తెలియజేయడంతో చెక్‌డ్యాం వద్దకు చేరుకొని రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు.

 
Advertisement
 
Advertisement