మక్తల్‌ నియోజకవర్గ పరిధి మాగనూర్‌ | Sakshi
Sakshi News home page

మక్తల్‌ నియోజకవర్గ పరిధి మాగనూర్‌

Published Fri, Dec 1 2023 3:00 AM

బల్సుపల్లిలో  గ్రామస్తులను చెదరగొడుతున్న పోలీసులు  - Sakshi

● మక్తల్‌ నియోజకవర్గ పరిధి మాగనూర్‌ మండలం వర్కూరులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. 59, 60వ పోలింగ్‌ స్టేషన్‌లోకి బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వెళ్తుండగా.. కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. చిట్టెం, ఆయన వాహనంపై హస్తం శ్రేణులు దాడికి యత్నించగా.. పోలీసులు, గన్‌మెన్లు ఎమ్మెల్యేను వాహనంలో అక్కడి నుంచి పంపించారు.

● మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో 100, 101 పోలింగ్‌ స్టేషన్ల వద్ద టీఎన్జీఓస్‌ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రాజేందర్‌ రెడ్డిపై కొందరు దాడి చేశారు. తనపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేశారని మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజేందర్‌రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

● పదర మండలం వంకేశ్వరంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి తోపులాట, ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

● దేవరకద్ర మండలంలోని బల్సుపల్లిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలింగ్‌ కేంద్రం సమీపంలో రెండు వర్గాల వారు ప్రచారం చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అడవి అజిలాపూర్‌లోనూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మండల నాయకులు గ్రామానికి రావడంతో అడ్డుకోగా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

● గద్వాల పట్టణంలో మోమిన్‌మహల్ల, దౌదార్పల్లిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

● హన్వాడమండలంలోని కొత్తపేటలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన చందర్‌నాయక్‌, రామచందర్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవినాయక్‌ తెలిపారు. పోలింగ్‌ బూత్‌ ముందు ప్రచారం చేస్తుండటంతో ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇరువురిపై కేసులు నమోదు చేశారు.

● కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరులో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంతునాయక్‌ అనుచరులు వాగ్వాదానికి దిగారు. పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నేత జగదీశ్వర్‌రావు అనుచరునిపై జూపల్లి కృష్ణారావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. సాతాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి అనుచరుడిపై దాడి చేశారు. కోడేరు, మాచుపల్లి గ్రామాల్లో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య గొడవలు జరిగాయి.

చెదురుముదురు ఘటనలు ఇలా..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement