
చిరంజీవి సతీమణి సురేఖకు స్వాగతం పలుకుతున్న ఆలయ ఈఓ
జోగుళాంబ శక్తిపీఠం: అలంపురం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను మంగళవారం మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుష్మిత, శ్రీజ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు సంకల్పసిద్ధి గణపతికి ప్రత్యేక అభిషేకాలు, బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. కార్తీక మాసం కావడంతో వారు శైవ, శక్తి క్షేత్రాలను దర్శించుకున్న అనంతరం కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే జోగుళాంబ ఆలయంలో త్రిశతి, ఖడ్గమాల అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ వారికి క్షేత్ర ప్రాశస్త్యం తెలియజేశారు. తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా అలంపురం బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్.ప్రసన్నకుమార్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరురుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయాల్లో పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అదేవిధంగా షాఅలీ పహిల్వాన్ దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తన గురువు ఆకుమళ్ల కృష్ణమూర్తి ఆశీస్సులు అందుకున్నారు.
నేడు బహిరంగ వేలం
అలంపురం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వివిధ రంగాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ తెలిపారు. టెంకాయలు, పూజాసామగ్రి విక్రయించేందుకు రూ.10లక్షలు, వాహనాల పా ర్కింగ్ వసూలుకు రూ.10లక్షలు, ఫొటోలు, సీడీలు మొదలగునవి అమ్ముకునేందుకు రూ.3లక్షలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు రూ.3లక్షలు, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.3లక్షల డీడీ చెల్లించి, వేలంలో పాల్గొనాలని కోరారు.