సాగులో లద్దెపురుగుతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

సాగులో లద్దెపురుగుతో జాగ్రత్త

Jun 5 2023 12:50 AM | Updated on Jun 5 2023 12:50 AM

గుడ్ల నుంచి పొదిగిన
పొగాకు లద్దె పురుగులు  - Sakshi

గుడ్ల నుంచి పొదిగిన పొగాకు లద్దె పురుగులు

అవగాహనతోనే నివారణ

లద్దె పురుగు గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటే నివారణ సులభం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచన చేస్తున్నారు. తల్లి పురుగు పెట్టిన గుడ్లు నాలుగైదు రోజుల్లో పొదిగి గొంగళి పురుగుగా మారుతుంది. తర్వాత బాగా ఎదిగిన గొంగళి పురుగుగా మారుతాయి. ఎదిగిన గొంగళి పురుగు ప్రధానంగా లేత గోధుమ రంగు కలిగి మెడ మీద ప్రముఖంగా కనిపించే నల్లటి మచ్చలతో శరీరమంతా సన్నటి లేత రంగు గీతలు కలిగి ఉంటాయి. కోశస్థ దశ మొక్కలకు దగ్గరగా భూమిలో గడుపుతుంది.

అలంపూర్‌: పంటసాగులో లద్దె పురుగు ఆశించి పంటకు తీవ్రనష్టం కలిగిస్తాయి. ఈ పురుగు ఆశించికుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ సక్రియనాయక్‌ రైతులకు సూచిస్తున్నారు. రెక్కల పురుగు లేత గోధుమ రంగులో ఉండి ముందు మచ్చ రెక్కలు కలిగి ఉంటాయి. తల్లి పురుగులు ఆకులపై వందల గుడ్లను గుంపులో పెట్టి వాటిపై గోధుమ వర్ణం కలిగిన నూగుతో కప్పుతాయి. ఒక్కొక్క తల్లి పురుగు తన జీవిత కాలంలో వెయ్యికిపైగా గుడ్లను పెడుతుంది. పంట కాలంలో పండించే వివిధ పంటలైన వరి, ఆముదం, పొగాకు, కంది, పప్పుశనగ, పెసర, మినుము, కూరగాయల పంట టమాట, వంగ, బెండ, మిరప పంటలకు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. పొగాకు లద్దె పురుగు వివిధ పంటల్లో ఆశించి రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తాయని ఏడీఏ వివరించారు.

తొలి దశలో..

తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకుల మీద పత్ర హరిత పదార్థాన్ని గీకి తిని జల్లెడ ఆకులుగా మారుస్తాయి. పెద్ద పురుగులు ఆకులను కొరికి తిని నెలను మాత్రమే మిగిలిస్తాయి. పూత మొగ్గలు, కాయలను ఆశించి లోపలి పదార్ధాలను తిని నష్టపరుస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు పగలంత నేల మీద, చెత్త కింద, మట్టి పెళ్లల కింద, నెర్రల్లో దాగి ఉండి రాత్రిళ్లు పైరుపై ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. రైతులు మొదట గుడ్ల సముదాయాలను, జల్లెడ ఆకులను చిన్న చిన్న గొంగళి పురుగుల గుంపులను బట్టి పురుగు ఉనికి గమనించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు మాత్రమే ఉన్న ఆకులను చెట్ల మొదళ్లలో పగటి పూట దాగి ఉన్న నునుపైన పెద్ద గొంగళి పురుగులను బట్టి ఉనికి గమనించవచ్చు. దీని జీవిత చక్రం 30 నుంచి 40 రోజుల్లో ముగుస్తుంది.

పాటించాల్సిన పద్ధతులు

● వేసవిలో లోతు దుక్కులు దున్నడం వలన భూమిలో విశ్రాంత దశలో ఉన్న పురుగులు, కోశస్థ పురుగులను అదుపులో ఉంచవచ్చు. రైతులు సమష్టిగా ఒకేసారి విత్తుకోవడం పూర్తి చేయాలి.

● నత్రజని ఎరువులను అతిగా వాడరాదు. సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వాడాలి.

● పంట మార్పిడి విధానాన్ని పాటించాలి.

● ఎర పంటలుగా 100 ఆముదం మొక్కలు ఎకరం పొలంలో అక్కడక్కడ వేయాలి.

● 4–5 లింగాకర్షన బుట్టలను అమర్చాలి. వీటికి 50 మీటర్ల దూరానికి ఒక్కటి చొప్పున మొక్కల కంటే అడుగు ఎత్తులో అమర్చాలి.

● పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ఎకరాకు 15–20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.

● పొలంలో బొరుగులు చల్లితే పక్షలు వాటిని తింటూ పురుగులను తింటాయి.

● గుడ్ల సముదాయాలు, పిల్ల లద్దె పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉంటాయి. వాటిని ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి.

● మొక్క దశను బట్టి గుడ్లను తొలి దశ పిల్లి పురుగులను నివారించడానికి ఐదు శాతం వేప గింజల ద్రవణాన్ని పిచికారి చేయాలి. దీని వలన తల్లి పురుగు మొక్కలపై తక్కువ గుడ్లు పెడతాయి.

● తొలిదశ పిల్ల పురుగులను అదుపులో ఉంచడానికి ఎన్‌పీవీ ద్రావణాన్ని 500 ఎల్‌ఈ చొప్పున కిలో బెల్లం, శాండోవిట్‌ కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. దీంతో పురుగులు కొమ్మకు వేలాడి చనిపోతాయి.

● లద్దె పురుగులు పంట పొలం నుంచి మరో పొలంలోకి రాత్రి వేళల్లో వలస పోతాయి. కనుక పొలం చుట్టూ ఒక లోతు నాగలి చాలు కందకం చేసి అందులో ఫాలిడల్‌ పొడిని చల్లాలి. ప్రతి 70 మీటర్ల చాలుకు ఒక కిలో పొడి మందును వాడాలి.

● ప్రకృతిలోని మిత్ర పురుగులను పంట పెరుగుదలకు హాని చేసే పురుగుల ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని దృష్టిలో ఉంచుకుని మిగిలిన అన్ని పద్ధతుల ద్వారా పురుగులను అదుపులో ఉంచలేకపోయినప్పుడు మాత్రమే పురుగుల మందులు పిచికారీ చేయాలి.

● పురుగు మధ్యస్త దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిపాస్‌ 2.5 ఎంఎల్‌ లేదా థయోడికార్బ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్‌ ఒక ఎంఎల్‌ లేదా అసిఫేట్‌ 1.5 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. 50 శాతం పంటలో నష్టం గమనించినట్లయితే అయితే స్పైనోశాడ్‌ 0.3 ఎంఎల్‌ లేదా ఇయమెక్టిన్‌ బెంజోమెట్‌ 0.5 గ్రాములు లేదా లూఫెన్యురాన్‌ ఒక ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

● ఎదిగిన లద్దె పురుగుల నివారణకు 5కిలోల తవుడు, 0.5 కిలో బెల్లం, 0.5 లీటర్ల మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరిఫైరిఫాస్‌ తగినంత నీళ్లు కలిపి చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదళ్లలో సాయంత్రం పూట చల్లుకోవాలి.

● విష ఎరలను తయారు చేసుకోలేని పక్షంలో క్లోరాన్‌ ట్రానిప్రోల్‌ 0.3 ఎంఎల్‌ లేదా ప్లూబెండియమైడ్‌ 0.2 ఎంఎల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసి పెద్ద పురుగులను నివారించుకోవచ్చు.

● పొలంలో కిందపడిన ఎండు ఆకులను తీసి కాల్చివేయాలి.

పాడి–పంట

వేసవిలో లోతు దుక్కీలు అవసరం

నత్రజని ఎరువులను అతిగా వాడొద్దు

ఎకరం పైరులో వంద ఆముదం మొక్కలు

లింగాకర్షన బుట్టలు, పక్షి స్థావరాలు

అవసరం

1
1/3

అముదం పంట ఆకు మీద పొగాకు లద్దె పురుగు  
2
2/3

అముదం పంట ఆకు మీద పొగాకు లద్దె పురుగు

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement