
డెంగీపై కేసులపై ప్రత్యేక నజర్
పాలమూరు: జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఆరోగ్య శాఖ అధికారులు యాంటీ లార్వా ఆపరేషన్స్‌తో పాటు ఫీవర్ సర్వే చేస్తున్న పాజిటివ్ కేసులు క్రమంగా రెట్టింపు అవుతున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో అర్బన్ ఏరియాలో 41 హైరిస్క్ ప్రాంతాలు, రూరల్ ఏరియాలో 20 హైరిస్క్ ఏరియాలను గుర్తించి ఆ ఏరియాల్లో ప్రతి రోజు ఏఎల్‌ఓ ఆపరేషన్స్ చేయడంతో పాటు ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఇంట్లోని ప్రతి గదిలో అన్ని మూలాలకు ఇండోర్ స్ప్రే చేయడంతో పాటు ఆ చుట్టు పక్కల సైతం 50 నుంచి 100 ఇళ్ల వరకు యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆరోగ్య శాఖ పరిధిలో మొత్తం 91 డెంగీ పాజిటివ్ కేసులు వస్తే.. అర్బన్ ఏరియాలో 60 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులపై ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయగా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని రామయ్యబౌళి, సద్దలగుండు, మోతీనగర్ ఏరియాలో పర్యటించారు. డెంగీ బాధితులను పరామర్శించి స్థానిక పరిస్థితులపై డీఎంహెచ్‌ఓ ఆరా తీశారు.
జిల్లాలో 61 హైరిస్క్ ప్రాంతాలు గుర్తింపు
జిల్లా ఆరోగ్య శాఖలోని మలేరియా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో మూడేళ్ల కాలంలో ఎక్కువగా డెంగీ కేసులు వస్తున్న 61 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. ఇందులో ప్రధానంగా సద్దలగుండు, మోతీనగర్, షాషాబ్‌గుట్ట, జైనల్లీపూర్, అయ్యవారిపల్లి, క్రిస్టియన్‌పల్లి, కోయనగర్, రామయ్యబౌళి, పాత పాలమూరు, ఎదిర, సీసీకుంట, జానంపేట, కోయనగర్, బీకే రెడ్డి కాలనీ, అయోధ్యనగర్, వీరన్నపేట, ప్రేమ్‌నగర్, మూసాపేట ఏరియాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉండే ఇళ్లను ప్రత్యేకంగా బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ ఇళ్లలో జ్వరపీడితులు ఉన్నారా? ఇతర ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నాం..
ప్రతి ఇంట్లో తోక పురుగులు లేకుండా చూసుకోవాలి. నిత్యం క్లోరినేషన్ చేసుకోవడంతో పాటు దోమ తెరలు, నీటి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హైరిస్క్ ఏరియాల్లో ఏఎల్‌ఓ ఆపరేషన్స్‌లో భాగంగా ఫాగింగ్ చేయిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వర పీడితులను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్న ఏరియాల్లో అనుమానితుల నుంచి శాంపీల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్‌ఓ
ఏఎల్‌ఓ ఆపరేషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆరోగ్యశాఖ
ఇప్పటి వరకు 91 కేసులు నమోదు
డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు