
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
కల్వకుర్తి రూరల్: కమ్యూనిస్టు పార్టీలకు వందేళ్ల చరిత్ర ఉందని.. పార్టీ సూర్యోదయం ఉన్నంత వరకు ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌యార్డులో పార్టీ జిల్లా మూడో మహాసభలు జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ అధ్యక్షతన నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టుల చరిత్ర త్యాగాల పునాదులపై ఏర్పాటైందని.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చే వరకు పోరాడే పార్టీ అన్నారు. భూ పోరాటాలు చేసి లక్షలాదిమంది పేదలకు భూ పంపిణీ చేయించామని.. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అంగన్‌వాడీలు తదితరుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే ఏకై క పార్టీ తమదేనని తెలిపారు. ప్రతి మూడేళ్లకు ఓసారి మహాసభలు నిర్వహించి దేశంలో ఏ పార్టీ ఏ విధంగా ఉందో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో బీజేపీ ప్రమాదకర పార్టీ కావడంతోనే కాంగ్రెస్‌కు అండగా ఉండి పేదల అభ్యున్నతికి ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రజెండా ఎగిరేలా అన్నిచోట్ల పోటీ చేయాలని కోరారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి కమ్యూనిస్టులను అంతం చేసేందుకు గడువు విధించారని.. ఎవరితోనూ సాధ్యం కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఏకమైనప్పుడు ఢిల్లీ ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని తెలిపారు. మావోయిస్ట్ అగ్రనేత కేశవరావును హత్య చేయడం దారుణమని.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దహనం చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్‌లో ఖమ్మం జిల్లాలో పార్టీ వందేళ్ల వేడుకలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మానవజన్మ ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని.. ప్రజా సమస్యలే అజెండాగా ఉన్న కమ్యూనిస్టు పార్టీని ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. ఎర్రజెండా నీడన ప్రతి ఒక్కరూ ఉంటారన్నారు. పట్టణంలోని గచ్చుబావి నుంచి బహిరంగ సభ వేధిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వార్ల వెంకటయ్య, డా. శ్రీనివాస్, కేశవగౌడ్, ఫయాజ్ పరశురాములు, చంద్రమౌళి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టు పార్టీల చరిత్ర అజరామరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం