
ఎగువ నుంచి జూరాలకు భారీగా వరద
ధరూరు/ఆత్మకూర్: కర్ణాటక, మహరాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 19 క్రస్టు గేట్లను ఎత్తి 1.86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 23,729 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,250 క్యూసెక్కులు, కుడి కాల్వకు 650 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి 2.13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.498 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
వేగవంతంగా విద్యుదుత్పత్తి ...
శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 180.873 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 215.287 మిలియన్ యూనిట్లు కలిపి మొత్తం 396.160 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
ఎగువన ప్రాజెక్టుల స్థితి..
జూరాల ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 103.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.40 లక్షల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 34.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 25 గేట్లను ఎత్తి జూరాలకు 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
12 గేట్ల ద్వారా నీటి విడుదల
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఎగువ నుంచి 48వేల క్యూసెక్కు ఇన్‌ఫ్లో రాగా..12 గేట్లను మీటర్ మేర తెరిచి 47,448 క్యూసెక్కుల నీటిని దిగువకు, 1,847 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్‌కు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
ప్రాజెక్టుకు 2.15లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
19 క్రస్టు గేట్ల ఎత్తివేత
2.13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..