
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జడ్చర్ల: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. గురువారం మిడ్జిల్‌లో కలెక్టర్ రెండు గంటల పాటు పర్యటించారు. మొదటి కస్తూర్బాగాంధీ పాఠశాలలో భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల కు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. పరిసరాలు ఎప్పటికప్పడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రెయినేజీ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో చెత్త చెదారం పేరుకుపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేశారు. మిడ్జిల్–కొత్తూరు ప్రధాన రహదారిపై చెత్త కుప్పలు కనిపించడంతో పంచాయతీ కార్యదర్శి సాయన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉందని, ఇందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం, అందుకు అవుతున్న ఖర్చులపై ఆరా తీశారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తనిఖీలు చేశారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ భాస్కర్, తహసీల్దార్ యూపీ రాజు, ఎంపీడీఓ గీతాంజలి, ఎంపీఓ ఆనంద్, డాక్టర్ శివకాంత్, మాజీ ఎంపీటీసీ ఎండీ గౌస్ ఉన్నారు.
పారద్శకంగా విచారణ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రీ సర్వే చేసిన పట్టదారుల వివరాలను పహాణిలోని వివరాలపై పారదర్శకంగా విచారణ చేయాలని సీసీఎల్‌ఏ రాష్ట్ర కమిషనర్ లోకేష్, సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ హనుమంతు ఆదేశించారు. గండేడ్ మండలం సాలార్‌నగర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేసిన రీసర్వేపై వీసీ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ సర్వే సిబ్బంది ఫీల్డ్‌కి వెళ్లి రీ సర్వే చేసిన పట్టాదారుల పహాణీలోని వివరాలు విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులు పారదర్శంగా వ్యవహరించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ఆ బాధ్యత అధికారులదేనన్నారు. వీసీలో కలెక్టర్ విజయేందిర, అడిషనల్ కలెక్టర్ ఎనుగు నర్సింహారెడ్డి, ఆర్‌డీఓ నవీన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్‌రావు పాల్గొన్నారు.