
3 పట్టణాలతో కలిపి క్లస్టర్ ఏర్పాటు
పాలమూరు/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్‌ను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ క్లస్టర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. దీనికి సంబంధించి రూ.975.48 కోట్లతో తయారుచేసిన సమగ్ర ప్రతిపాదనలను గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఎమ్మెల్యేతో పాటు ఎంపీ డీకే అరుణ కలిసి అందజేశారు. దీని ఆవశ్యకతను ఈ సందర్భంగా వారు వివరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక, క్రీడ లు, కమ్యూనిటీ సెంటర్లు, ఆడిటోరియాలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రంథాలయాలు, పార్కుల ఏర్పాటుతో ప్రజారవాణా, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ పాటికే మహబూబ్‌నగర్ క్లస్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కాగా, దీనికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు.
వారం రోజుల్లో
సమస్యలు పరిష్కరిస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలోని దివిటిపల్లిలో నెలకొన్న సమస్యలను వారం రోజులలోగా పరిష్కరిస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం దివిటిపల్లికి వెళ్లి స్థానికులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి కాలనీ వరకు రోడ్డు సౌకర్యం, అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వీధి దీపాలు వెలగడం, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదని వారు వాపోయారు. వీటన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీపీఎం నాయకులు ఎ.రాములు, నల్లవెల్లి కురుమూర్తి, కడియాల మోహన్, రాజ్‌కుమార్, భానుప్రసాద్, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివప్రసాద్‌రెడ్డి, కాజల్ చంద్రశేఖర్, సురేందర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
కార్మిక సంక్షేమాన్ని
విస్మరిస్తున్న ప్రభుత్వం
పాలమూరు: ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమా న్ని విస్మరించి హక్కులను కాలరాస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.వెంకటేష్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాంబశివుడుతో కలిసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచలేదని ఆరోపించారు. కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా అప్రజాస్వామిక పాలనను కొనసాగించిందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, టైంస్కేల్ విధానాన్ని పట్టించుకోకుండా రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించందన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజుకు అందజేశారు. కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండన్న, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, వివిధ రంగాల కార్మిక సంఘాల నాయకులు పి.దాసు, డి.అరుణ, బాలు, నర్సింహులు పాల్గొన్నారు.

3 పట్టణాలతో కలిపి క్లస్టర్ ఏర్పాటు

3 పట్టణాలతో కలిపి క్లస్టర్ ఏర్పాటు