
రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోం
నారాయణపేట/దామరగిద్ద/అమరచింత: తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని.. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు గురువారం దామరగిద్ద మండలం కానుకుర్తిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ఆమె హాజరై రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలోనూ చెరువులు నింపుకొన్నాం.. కానీ, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా చెరువులు నింపుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రధాయినిగా కాళేశ్వరం ఉన్నట్లు.. దక్షిణ తెలంగాణకు ఎంతో మేలు చేయాలనే దూరదృష్టితో కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారన్నారు. ఈ ప్రాజెక్టు పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. కొడంగల్, పేట నియోజకవర్గాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టు డిజైన్ చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం లక్ష ఎకరాలకే సాగునీరు అందించేలా మార్చారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు తీసుకుపోవడం మంచిదే.. కానీ, మధ్యలో ఉండే నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూర్ ప్రాంతాల రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. జూరాల నుంచి కాకుండా భూత్పూర్ రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా తీసుకువస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భీమా ప్రాజెక్టులో నీటి లభ్యత లేకుండాపోతుందని, ఫలితంగా మక్తల్ ప్రాంతానికి సాగునీరు అందే పరిస్థితి ఉండదన్నారు.
తమకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఎదుట నిర్వాసిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబంలో 10–15 ఎకరాల భూమి కోల్పోతున్నామని రైతులు బోరున విలపించగా ఆమె వారిని ఓదార్చారు. రైతులు సమ్మతించే విధంగా పరిహారం అందే వరకు వెన్నంటి ఉంటానని, ఎవరూ బాధపడొద్దని పేర్కొన్నారు. అంతకు ముందు కాన్‌కుర్తికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సుభాష్, బాపన్‌పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, గున్ముక్ల గౌని శ్రీనివాసులు, నాయకులు జ్ఞానేశ్వర్, కృష్ణారెడ్డి, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. కాన్‌కుర్తిలో గ్రామ సభ ముగిసిన అనంతరం గద్వాలలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై ఆగి.. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణానదికి కవిత పూజలు చేశారు.
రైతుల కన్నీటి గోస
ఊళ్లు ముంచుడు ఎందుకో..
కేసీఆర్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని, అదేవిధంగా పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా భూములు కోల్పోయే వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి.. ఎకరాకు రూ.35–40 లక్షల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాకుండా భూములు కోల్పోయే గ్రామస్తులకు ఇళ్లు, భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రూ.20 లక్షలు పరిహారం ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా స్థానిక అధికారులు రూ.14 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నీళ్లు రాని ప్రాజెక్టు కోసం ఊళ్లు ముంచుడు ఎందుకో ఆలోచించాలన్నారు. కానుకుర్తి గ్రామ ప్రజల పక్షాన తాను నిలబడతానని పేర్కొన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని.. మన పాలమూరు కంట కన్నీరు కారకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎందేనన్నారు.
పేట– కొడంగల్ నిర్వాసితులకు న్యాయం చేసే దాకా పోరాటం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత