
తల్లిపాలే కీలకం
శిశువు ఎదుగుదలలో
డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం
మహబూబ్‌నగర్ రూరల్: ‘‘మాతృత స్పర్శకు ప్రతి మహిళ పరితపిస్తుంది.. పుట్టిన బిడ్డ ప్రేమను ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఆ సమయంలో తల్లిపాలు పసికందుకు సంజీవనిలా పని చేస్తుందని అనేకసార్లు వైద్య నిపుణులు నొక్కి చెప్పారు’’.. తల్లి పాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు వివరిస్తారు. తల్లిపాలపై ఉన్న అపోహలను పోగొట్టి.. తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బాలింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు శుక్రవారం తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
తల్లిపాలే బిడ్డకు అమృతం
ప్రస్తుతం పుట్టిన గంటలో 41 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు తల్లి పాలలో ఉంటాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. దీనివల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లలోపు వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ, డయాబెటిస్ క్యాన్సర్, ఊబకాయం, చెవిలో ఇన్‌ఫెక్షన్‌లు వంటివి రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల మానసిక పెరుగుదలకు తల్లి పాలు ఎంతో దోహదం చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాలను తప్పక ఇవ్వాలని వైద్యులు స్పష్టం చేస్తుంటారు.
ఇంటింటికీ అంగన్‌వాడీ పేరుతో
అవగాహన
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాలే కీలకం