మహబూబాబాద్ అర్బన్: తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. బుధవారం జిల్లావ్యాప్తంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. గణపతి బొప్పా మోరి యా.. బోలో గణేశ్ మహరాజ్‌కి జై.. అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో మొత్తం 2,380 విగ్రహాలను భక్తులు ఆయా వీధులు, గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారు. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి వినాయక విగ్రహాలను భక్తులు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు.
శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే..
జిల్లా కేంద్రంలో సుమారు 200 విగ్రహాలు ఏర్పాటు చేశారు. నిజాం చెరువులో గణేశ్ నిమజ్జనోత్సవం నిర్వహించారు. మదర్‌థెరిస్సా సెంటర్‌లోని ఫారెస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మున్సిప ల్ చైర్‌పర్సన్ జ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కౌన్సిలర్లు నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులకు పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి పూజ లు నిర్వహించారు.
భారీ బందోబస్తు..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 22 మంది జవాన్లు, 150 మంది పోలీసు సిబ్బంది నిమజ్జన ప్రదేశంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపులో భాగంగా పలు వాహనాల్లో తరలిన గణపతి విగ్రహాలను జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్‌లో కౌన్సి లర్లు, నాయకులు, డీఎస్పీ, టౌన్ సీఐ దగ్గరుండి నిమజ్జనానికి సాగనంపారు. ఈ శోభాయాత్ర జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సెంటర్ నుంచి చేపల మార్కెట్ మీదుగా వివేకానంద సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా నిజాం చెరువు వరకు కొనసాగించి భక్తులు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. వేలాది మంది భక్తులు బారులుదీరి శోభాయాత్రను తిలకించారు. కాగా, పోలీసులు మూడు భారీక్రేన్లు ఏర్పాటు చేసి గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, జిల్లా వైద్యారోగ్య, విద్యుత్, అగ్నిమాపక, మత్స్య, ఇరిగేషన్, పోలీస్ శాఖ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కనులపండువగా శోభాయాత్ర
పూజలు చేసిన ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ
పోలీసుల భారీ బందోబస్తు
వర్షంలో తడిసిముద్దయిన భక్తులు


