సేవాభావం.. వ్యక్తిత్వవికాసం | - | Sakshi
Sakshi News home page

సేవాభావం.. వ్యక్తిత్వవికాసం

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న జాతీయ సేవాపథం (ఎన్‌ఎస్‌ఎస్‌) విద్యార్థుల్లో సేవాభావం.. వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తోంది. విద్యార్థులు వలంటీర్లుగా వ్యవహరిస్తూ చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అంశంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఘనత యూనివర్సిటీకి ఉంది. కాగా, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 1969లో సెప్టెంబర్‌ 24వ తేదీని జాతీయ సేవాపథం(ఎన్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించి ప్రతీ ఏడాది నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నేడు కాకతీయ యూనివర్సిటీలో ఈ వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

కేయూ ఆవిర్భావం నుంచి..

కాకతీయ యూనివర్సిటీ 1976, ఆగస్టు 19న ఆవిర్భవించింది. అప్పటినుంచే ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. వర్సిటీ పరిధిలోని 11 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలల్లో 356 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 100మంది చొప్పున మొత్తం 36,500 మంది వలంటీర్లు ఉన్నారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, శ్రమదానం, మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా, రక్తదానం చేయడంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ముందంజలో ఉన్నారు.

ఎన్‌ఎస్‌ఎస్‌లో కొత్త కార్యక్రమాలు కూడా..

ఎన్‌ఎస్‌ఎస్‌ సేవల్లో ప్రధానంగా స్వచ్ఛ భారత్‌, మేరా దేశ్‌ మేరా మిట్టి, స్వాభిమాన్‌ స్వచ్ఛత, స్వభావ్‌ స్వచ్ఛత, రాష్ట్రీయ ఏక్తాదివస్‌, రాష్ట్రీయ ఏక్తాదివస్‌, ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌ దివాళీ మై భారత్‌’ తదితర చైతన్యకార్యక్రమాలతోపాటు యూత్‌, మాక్‌ పార్లమెంట్‌లు, ఆపదపమిత్ర పేరుతో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా శిక్షణ ఇస్తున్నారు. కేయూ పరిధిలో ఆపద మిత్ర పేరుతో ఇటీవల ప్రారంభమైన కార్యక్రమంలో 600 మంది వలంటీర్లకు శిక్షణ కొనసాగుతోంది.

కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌కు నిధులు కూడా ..

ఈ విద్యాసంవత్సరం 2026–2027 నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచే నేరుగా కేయూ పరిధిలోని కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లకు నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 75, 500 రావాల్సి ఉండగా ఇటీవల అందులో ఒక్కో యూనిట్‌కు ఆయా కళాశాలల అకౌంట్‌లకు నేరుగా 50శాతం నిధులు విడుదల చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయగా అక్కడి నుంచి యూనివర్సిటీకి, ఆ తర్వాత యూనివర్సిటీ అధికారులు ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లకు విడుదల చేసేవారు. ఇప్పుడు మార్పు చేశారు. రెగ్యులర్‌ కార్యక్రమాలకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ. 27,500, ప్రత్యేక శిబిరాలకు రూ. 35వేలు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులకు రూ. 8,500 విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ నిధులతో కళాశాలల్లోని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు తమ కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు.

కేయూ ఆడిటోరియంలో వేడుకలు

కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు క్యాంపస్‌లోని ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథులుగా తెలుగు అకాడమీ చైర్మన్‌ కె. వెంకటనారాయణ, రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి. మనోహర్‌, తదితరులు పాల్గొననున్నారు.

నేడు ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

కేయూ పరిధిలో 256 యూనిట్లు

35,600 మంది వలంటీర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement