మహబూబాబాద్: వలిగొండ నుంచి భద్రాచలం వరకు జాతీయ రహదారి 930–పీ పనులు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల గుడువు ఉండగా.. పనుల్లో వేగం పెంచారు. జిల్లాలో 69.08కిలో మీటర్ల మేర నిర్మాణం జరగనుండగా.. ఇప్పటికే 30కిలో మీటర్లలో పనులు జరుగుతున్నాయి. ఒక మైనర్ బ్రిడ్జి పనులు చేపడుతున్నారు.
రూ.540కోట్లతో జాతీయ రహదారి..
వలిగొండ టు భద్రాచలం జాతీయ రహదారి 930–పీ కోసం ప్రభుత్వం రూ.540 కోట్లు కేటా యించినట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా మానుకోట జిల్లా మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. జిల్లా పరిధిలో 69.08 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జూలై మాసంలోనే ఆ పనులు చేపట్టారు. జిల్లాలో తొర్రూరు నుంచి ఎన్‌హెచ్ మొదలవుతుంది. తొర్రూరు మండలం చిన్న వంగర నుంచి నెల్లికుదురు మండలం రావిరాల వరకు సుమారు 30 కిలోమీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం శివారు బయ్యారం రోడ్డులో పెద్దతండా సమీపంలో మైనర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.
అండర్‌పాస్‌లు..
నిర్మాణ పనుల్లో భాగంగా బయ్యారం మండల కేంద్రం ప్రధాన రోడ్డుపై రెండు మేజర్ బ్రిడ్జిలు, తొర్రూరు, మానుకోట శివారు సాలార్‌తండా వద్ద వెహికిల్ అండర్ పాస్‌లు (2 వీయూసీలు) నిర్మాణం చేయనున్నారు. మానుకోట శివారు అనంతారం రోడ్డులో నిర్మాణం చేస్తున్న మున్సిపాలిటీ భవనం సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గడువులోగా పూర్తి చేసేలా..
రెండేళ్ల గడువులోగా నిర్మాణ పనలు పూర్తి చేసేలా ఎన్‌హెచ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేసి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూస్తున్నారు. పనులకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయంతో ముందుకెళ్తున్నారు.
ఎన్‌హెచ్ పనులు జిల్లాలో ఇలా..
తొర్రూరు బైపాస్ మీదుగా నెల్లికుదురు బైపాస్ నుంచి మానుకోట సమీప శనిగపురం గ్రామశివారు బోరింగ్ తండా సమీపం నుంచి మెడికల్ కాలేజీ వెనుక నుంచి రజాలీపేట సమీపం మీదుగా సాలార్ తండా సమీపంలో నిర్మాణం జరగనుంది.
సాలార్‌తండా నుంచి కలెక్టరేట్ వెనుక నుంచి అనంతారం రోడ్డులో నూతన మున్సిపాలిటీ భవనం సమీపం నుంచి రైల్వే ట్రాక్‌మీదుగా ఆర్వోబీ నిర్మాణం చేసి ఆర్తిగార్డెన్ సమీపంలో ఇల్లెందు రోడ్డుకు అనుసంధానం చేస్తారు.
మానుకోట శివారు ఇల్లెందు రోడ్డు నుంచి బయ్యారంలోని నామాలపాడు మీదుగా ఇల్లెందు నుంచి కొత్తగూడెం జంక్షన్ మీదెగా ఎన్‌హెచ్–30కి కలుపుతారు.
వలిగొండ టు భద్రాచలం వరకు నిర్మాణం
ప్రారంభమైన రెండు నెలల్లోనే 30 కిలోమీటర్ల పనులు


