పోక్సో కేసులో.. యువకుడికి 20ఏళ్ల జైలు! | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో.. యువకుడికి 20ఏళ్ల జైలు!

May 27 2026 6:08 AM | Updated on May 27 2026 8:33 AM

-

తీర్పు ఇచ్చిన జిల్లా జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ

మహబూబాబాద్‌ రూరల్‌: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరం నిరూపణ అయిన ఓ యువకుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6,500 జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ మంగళవారం తీర్పు వెలువరించారు. 

కోర్టు డ్యూటీ అధికారి పైండ్ల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తొర్రూరు మండలంలో 2024, జూన్‌ 29న ఓ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలిక భయపడి ఆ విషయాన్ని దాచిపెట్టి మూడు రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులకు తెలిపింది.

జూలై 2వ తేదీన ఆ బాలిక తరఫు బంధువు ఒకరు తొర్రూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై రాంజీనాయక్‌ కేసు నమోదు చేసి నిందితుడిగా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన పసునూరి రామును గుర్తించారు. రాము తొర్రూరు పట్టణంలోని వాటర్‌ ప్లాంట్‌లో పనిచేస్తూ ఇంటింటికీ తిరుగుతూ వాటర్‌ క్యాన్లు వేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ బాలికపై కన్నేశాడు. ఒక రోజు ఆ బాలిక నూనె ప్యాకెట్‌ తీసుకురావటం కోసమని షాపునకు వెళ్లగా తన మిత్రుడి గదికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

కేసు నమోదు అనంతరం విచారణ జరిపి అప్పటి సీఐ సంజీవ విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. ప్రస్తుత డీఎస్పీ కృష్ణకిషోర్‌, సీఐ గణేష్‌, ఎస్సై మహేందర్‌ రెడ్డి, కోర్టు లైజన్‌ అధికారి జీనత్‌ ఆధ్వర్యంలో సీడీఓ శ్రీశైలం కోర్టులో 14 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌ పక్షాన స్పెషల్‌ పోక్సో కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంపల్లి వెంకటయ్య వాదనలు వినిపించారు.

ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవించిన జిల్లా జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ నేరం నిరూపణ అయిన రాముకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కాగా, రాముపై హైదరాబాద్‌ గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూడా పోక్సో కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నేరస్తుడికి శిక్షపడేలా పనిచేసిన పోలీసు అధికారులు, పోక్సో కోర్టు పీపీని ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement