కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 16,17 తేదీల్లో రెండురోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ విభాగం అధిపతి ఎన్. వాసుదేవరెడ్డి, పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలు సవితాజ్యోత్స్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ (సీఆర్‌సీఎస్–2026) అనే అంశంపై యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్‌హాల్‌లో ఉదయం 10గంటలకు ఈ సదస్సు నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారన్నారు. గౌరవ అతిథిగా సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.
నేటి నుంచి బధిరుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
హన్మకొండ అర్బన్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రా రంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనర్సమ్మ తెలిపారు. హనుమకొండలోని మయూరి గార్డెన్ లైన్, ప్రగతి నగర్ కాలనీ ఫేజ్–2లో ఉన్న ఈ పాఠశాలలో నేటి (సోమవారం) నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వికలాంగుల సంక్షేమ శాఖ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, ఆధార్డ్, రేషన్ కార్డు, నాలుగు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94407 39423, 98666 73486 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
కేసముద్రం: పిచ్చి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఆదివారం మున్సిపాలిటీ పరిధి చైతన్యనగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన కొమ్ము ముత్తమ్మ అర్ధరాత్రి సమయంలో బయటకు రాగా అక్కడే ఉన్న పిచ్చి కుక్కలు దాడి చేయడంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, నెల రోజుల్లో నలుగురు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. దీంతో ప్రస్తుతం వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.
బాలికపై అత్యాచారయత్నం?
● వ్యక్తికి దేహశుద్ధి.. ఓ గ్రామంలో ఘటన
ఖానాపురం: బాలికపై వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికను ఇదే గ్రామానికి చెందిన బోళ్ల ప్రసాద్ తన బైక్‌పై ఈనెల 13(శుక్రవారం) గ్రామంలోని ఓ కిరాణా షాపునకు తీసుకెళ్లాడు. షాపులో చాక్లెట్ కొనుగోలు చేసి బాలికకు అందజేసి సమీపంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం సదరు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక రోదించింది. సమీపంలో పంట పొలాల వద్ద ఉన్న రైతులు కేకలు వేశారు. దీంతో బాలి కను గ్రామంలోకి ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పొద్దని భయభ్రాంతులకు గురి చేసి వెళ్లిపోయాడు. బాలికకు స్నానం చేయించడానికి తల్లి తీసుకెళ్లగా జరిగిన విషయాన్ని తెలుపడంతో ప్రసాద్ ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై ఆదివారం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ సైతం చేపట్టినట్లు సమాచారం.


