పీఎస్‌బీ.. భూమికి సారం | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌బీ.. భూమికి సారం

Mar 16 2026 8:40 AM | Updated on Mar 16 2026 8:40 AM

సంగెం: పంటల్లో రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకుని జీవ ఎరువులు వాడడం వల్ల ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధించొచ్చు. పీఎస్‌బీ (పాస్పరస్‌ సాలిబులైజింగ్‌ బ్యాక్టీరియా) జీవ ఎరువు వినియోగిస్తే నేలలో కరగకుండా మిగిలిన భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఫలితంగా మొక్కలకు నీరు, పోషకాలు సమృద్ధిగా అంది అధిక పంట దిగుబడులు వస్తాయని సంగెం మండల వ్యవసాయ అధికారి బస్వపత్రి జగదీశ్వర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..

భాస్వరాన్ని కరిగించే పీఎస్‌బీ..

భూమిలో ఏళ్ల తరబడి నిక్షిప్తమైన పోషకాల విడుదలకు పీఎస్‌బీ కీలకంగా వ్యవహరిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి సహజంగా ఉండే పాస్పరస్‌(భాస్వరం) గడ్డకట్టి మొక్కలకు అందకుండా పోతుంది. దీంతో రైతులు అదనంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది. నేల ఆమ్లగుణం కలిగి ఉంటే ఇనుము లేదా అల్యూమినియం పాస్పెట్లుగా.. క్షారగుణం కలిగి ఉంటే కాల్షియం లేదా మెగ్నీషియం పాస్పెట్లుగా మారి మొక్కకు అందకుండా నేలలో గడ్డలుగా పేరుకుపోతుంది. పీఎస్‌బీ జీవ ఎరువు ఈ గడ్డ కట్టిన భాస్వరాన్ని కరిగించి మొక్కలకు సు లభంగా అందేలా చేస్తుంది. దీని వల్ల మొక్కల పె రుగుదల బాగుండడమే కాకుండా, పుష్పించడం, గింజల నాణ్యత పెరుగుతుంది. ఫలితంగా రసాయన ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

వినియోగ విధానం..

పీఎస్‌బీని విత్తన శుద్ధి, వేర్ల ముంచివేత, నేలలో కలిపి వాడొచ్చు. దీనిని నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. పీఎస్‌బీ వినియోగంతో నేలలోని భాస్వరం కరిగి మొక్కలకు పోషకాలు అందుతాయి. తద్వారా నేల సారవంతమవుతుంది. ఎకరాకు లీటర్‌ పీఎస్‌బీ జీవ ఎరువును బాగా కుళ్లిన 200 కిలోల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువులో కలుపుకోవాలి. కొద్ది మోతాదులో నీటిని చల్లుతూ తేమ ఆరిపోకుండా 15 రోజుల వరకు ఉండనివ్వాలి. తర్వాత పొలంలో చల్లుకోవాలి. నేలలో కలిసిపోయి మొక్కకు అందకుండా ఉన్న భాస్వరాన్ని ఇది కరిగించి అందేలా చేస్తుంది.

విత్తన శుద్ధి..

రైతులు పీఎస్‌బీని విత్తనశుద్ధి చేస్తే మొక్కలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కిలో విత్తనానికి 10 మి.లీ. పీఎస్‌బీ జీవ ఎరువును బెల్లం లేదా గంజి జిగుట పదార్థంలో కలిపి నీడలో ఆరబెట్టాలి. తర్వాత భూమిలో విత్తనం విత్తుకోవాలి.

వరినారు వేర్ల శుద్ధి..

లీటర్‌ పీఎస్‌బీ జీన ఎరువును 70 శాతం నీటిలో కలిపి నారుమడిలో చిన్న గుంత చేసి లేదా ప్లాస్టిక్‌ డబ్బాలో పోయాలి. ఇందులో పీకిన వరి నారును వేర్లు మునిగేలా 10–15 నిమిషాలు ఉంచి తర్వాత వరి నాటు వేసుకోవాలి. దీంతో వరి నారు శుద్ధి అయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవ ఎరువుల వినియోగంపై సందేహాలుంటే మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

భాస్వరాన్ని కరిగించి

దిగుబడి పెంచే జీవఎరువు

తగ్గనున్న పెట్టుబడులు

వరి సాగు రైతులకు ఏఓ జగదీశ్వర్‌ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement