వరాలతల్లులకు తీరొక్కమొక్కులు..
గద్దెలపై కొలువుదీరిన నలుగురు దేవుళ్లు
మేడారం(ఏటూరునాగారం/ములుగు): ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుకు భక్తజనం తీరొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. మేడారం మహా జాతరలో గద్దెలపై కొలువుదీరిన నలుగురు దేవుళ్లకు తనివి తీరా మొక్కులు అప్పజెప్పుతున్నారు. తమ కోరికలు తీరడంతో వనదేవలతకు ఒక్కో భక్తుడు ఒక్కో రకంగా మొక్కులు చెల్లిస్తున్నాడు. కాగా, మొక్కుల్లో ఎన్ని రకాలు.. ఏ కోరిక నెరవేరితే ఏ మొక్కు చెల్లిస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే అంశాలపై ‘సాక్షి’ కథనం
ఒడిబియ్యం..
శివసత్తులు పసుపు బియ్యంతో ఒడి బియ్యం తయారు చేసుకుని కుడుక, పోక, జాకెట్ ముక్క, నాణేన్ని ఎరుపు వస్త్రంలో కట్టి అమ్మవారి గద్దెల వద్ద చెల్లిస్తున్నారు.
కోడి, మేకపోతుల మొక్కులు
తమ ఇంటిల్లిపాది చల్లంగా ఉంటే మహాజాతరలో యాటలు, కోళ్లు కోసి మొక్కు చెల్లించుకోవడం భక్తుల ఆనవాయితీ. ఆ ప్రకారమే తమ కోరికలు నెరవేరడంతో పలువురు భక్తులు తల్లులకు యాటలు, కోళ్లు కోసి మొక్కులు సమర్పిస్తున్నారు.
నిలువెత్తు బంగారం
అన్ని రకాలుగా అచ్చాయం(ఆదాయం) ఇస్తే నిలువెత్తు బంగారం ఇస్తానని భక్తులు మొక్కుతారు. ఈ మేరకు కోరిక నెరవేరడంతో పలువురు భక్తులు తల్లులకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు.
ఉయ్యాల మొక్కులు
తమకు సంతానం కలిగిస్తే గద్దెల సన్నిధిలో ఊయల కడుతామని దంపతులు మొక్కుకుంటారు. ఈ మొక్కులు నెరవేరడంతో భక్తులు అమ్మవార్లకు ఊయల కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తలనీలాల సమర్పణ
తమకు సంతానం కలిగితే పుట్టు వెంట్రుకలు సమర్పిస్తామని దంపతులు తల్లలను మొక్కుకుంటారు. ఆ కోరిక నెరవేరడంతో పలువురు దంపతులు జంపన్నవాగు వద్ద తమ పిల్లల తలనీలాలు సమర్పిస్తున్నారు.
బండారి..
భక్తులు భక్తిశ్రద్ధలతో వనదేవతలకు పసుపు సమర్పిస్తారు. ఈ పసుపునే బండారి అంటారు. భక్తులు తమ శరీరానికి, నుదిటికి పసుపు రాసుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. బండారి మొక్కులను ప్రాధాన్యంగా భావిస్తారు.
వరం పట్టడం..
అమ్మవార్లను దర్శించుకునే ముందు భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులతో వరం పట్టిస్తారు. కాగా, పూనకంతో జంపన్నవాగులో అబ్బి యాల్లో అంటూ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారు.
వరాలతల్లులకు తీరొక్కమొక్కులు..
వరాలతల్లులకు తీరొక్కమొక్కులు..
వరాలతల్లులకు తీరొక్కమొక్కులు..


