ఊపందుకున్న నామినేషన్లు
మహబూబాబాద్/కేసముద్రం/తొర్రూరు/డోర్నకల్/మరిపెడ: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గురువారం నామినేషన్లు ఊపందుకున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబాబాద్‌లో గురువారం 103 నామినేషన్లు దాఖలు కాగా.. మొదటి రోజు 10తో కలిసి మొత్తంగా 113 దాఖలయ్యాయి. కేసముద్రంలో 58 నామినేషన్లు దాఖలయ్యాయి. డోర్నకల్‌లో 49 నామినేషన్లు దాఖలు కాగా.. మొదటిరోజు ఒకటి అయింది. మొత్తంగా 50 దాఖలయ్యాయి. మరిపెడలో రెండోరోజు 32 దాఖలు కాగా.. మొదటిరోజు రెండుతో కలిపి మొత్తంగా 34 దాఖలయ్యాయి. తొర్రూరులో రెండోరోజు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. కేసముద్రం, తొర్రూరులో మొదటిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కేసముద్రం నామినేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ సందర్శించారు. నామినేషన్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్లు పరిశీలించారు. కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


