నామినేషన్ వేద్దాం..
ఖరారు కాని పొత్తులతో కాంగ్రెస్ నాయకుల మల్లగుల్లాలు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో రెండో రోజు గురువారం వివిధ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. టికెట్ ఇచ్చినట్లు పార్టీల అధ్యక్షులు ధ్రువీకరించకపోవడంతో.. ముందుగా నామినేషన్ వేద్దాం.. టికెట్ రాకపోతుందా అనే నమ్మకంతో అభ్యర్థులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో ఒకరికి మించి పోటీ పడుతున్న వార్డుల్లో టికెట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతుండగా.. కాంగ్రెస్‌లో మాత్రం వామపక్ష పార్టీలతో పోత్తు తేలిన తర్వాతే టికెట్ల కేటాయింపు జరుగుతుందని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు.
పోటా పోటీగా నామినేషన్లు..
రెండో రోజు గురువారం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. దీంతో మొదటి రోజు నామినేషన్లను కలుపుకొని రెండో రోజు వరకు మున్సిపాలిటీల వారిగా మహబూబాబాద్‌లో 113, కేసముద్రం 58, మరిపెడ 34, తొర్రూరు 51, డోర్నకల్ 50 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. మరిపెడ మినహా ఇతర నాలుగు మున్సిపాలిటీల్లో పార్టీల వారిగా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలిసింది. ఇందులో కొందరికి అధికారికంగా బీ–ఫామ్‌లు కూడా అందజేశారు. మహబూబాబాద్‌లో మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో ఏ ఒక్కరికి కూడా బీ–ఫామ్‌లు ఇవ్వలేదు. పోటీ లేనివి, మిత్రపక్షాలు ఆశించని వార్డుల్లో శుక్రవారం ఇరు పార్టీల వారు బీ–ఫామ్‌లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీల నాయకులు చెబుతున్నారు.
వామపక్షాల పొత్తులపై చర్చలు..
అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలను కలుపుకొని పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా మహబూబాబాద్ పట్టణంలో కాంగ్రెస్, సీసీఐ, సీసీఎం పొత్తుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. సీపీఎంకు ఐదు వార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు అంగీకరించగా.. ఖమ్మం, ఇతర మున్సిపాలిటీల్లో పొత్తులు ఎలా ఉంటాయో అనే దానిపై వేచి చూస్తున్నారు. ఇక సీపీఐ మాత్రం తమకు ఎనిమిది వార్డులకు తగ్గకుండా కేటాయించాలని చెబుతుండగా.. ఐదు వార్డులు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం కొలిక్కి వస్తే పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఐదు స్థానాలు ఇచ్చినట్లు
సీపీఎం ప్రచారం
తగ్గేది లేదంటున్న సీసీఐ
బీఆర్‌ఎస్‌లోనూ పోటాపోటీగా
నామినేషన్లు


