రైతన్న మొగ్గు
మహబూబాబాద్ రూరల్ : ఆధునిక వ్యవసాయంవైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చు...ఎక్కువ లాభం కోసం సరికొత్తగా సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నారు పోయాలి.. నీరు పెట్టాలి.. కూలీలతో నాట్లు వేయించాలి.. ఇవన్నీ పాతతరం వరి సాగు పద్ధతి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నదాతలు నూతన పద్ధతులు అవలంభిస్తున్నారు. వరి సాగులో కూలీలు, యంత్రాల కొరత అధిగమించడానికి, పెట్టుబడి తగ్గించుకోవడానికి, అధిక దిగుబడి సాధించేందుకు సాంకేతిక పద్ధతులు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతుల్లో రైతులు వరి సాగు చేపట్టి ఖర్చు తగ్గించుకుంటున్నారు.
వర్షాధార, నీటి కొరత ఉన్న
ప్రాంతాల్లో అమలు..
వెదజల్లే పద్ధతిలో విత్తనాలను నేరుగా పొలంలో వెదజల్లి వరి సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా వర్షాధార, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తున్నారు.
ముఖ్య లక్షణాలు..
● నర్సరీలు అవసరం ఉండదు.
● నాట్ల ఖర్చు, కూలీల అవసరం తగ్గుతుంది.
● తక్కువ సమయంలో పంట సాగు
● నీటి వినియోగం తక్కువ
సాగు విధానం..
● పొలాన్ని నున్నగా దున్ని సమతలంగా సిద్ధం చేయాలి.
● నాణ్యమైన విత్తనాలను ఎకరాకు సుమారు 20 నుంచి 25 కిలోలు వెదజల్లాలి.
● విత్తనం వెదజల్లిన తర్వాత తేలికపాటి నీరు ఇవ్వాలి.
కలుపు నియంత్రణ..
● విత్తిన 2 నుంచి 3 రోజుల్లో ప్రీఎమర్జెన్స్ కలుపు మందు వాడాలి.
● అవసరమైతే తర్వాత చేతితో లేదా పోస్ట్ ఎమర్జెన్స్ మందులతో కలుపు నియంత్రణ.
ఎరువుల నిర్వహణ..
● సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వేయాలి.
● యూరియాను విడతలుగా ఇవ్వడం మంచిది.
నీటి నిర్వహణ..
● మొక్కల ప్రారంభ దశలో నీరు నిల్వగా ఉండకూడదు.
● మొక్కలు స్థిరపడిన తర్వాత తేలికపాటి నీరు నిలిపి ఉంచాలి.
ప్రయోజనాలు..
● ఖర్చు తగ్గి లాభం పెరుగుతుంది.
● వర్షం ఆలస్యమైనప్పుడు కూడా సాగు సాధ్యం.
● యాంత్రీకరణకు అనుకూలం.
● సరైన విత్తన మోతాదు, కలుపు నియంత్రణ, ఎరువుల సమతుల్య వినియోగం ఉంటే వెదజల్లే వరి సాగులో మంచి దిగుబడి పొందవచ్చు.
జిల్లాలో ఐదు వేల ఎకరాల మేరకు సాగు..
జిల్లాలో 1,75,250 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల వరకు వెదజల్లే పద్ధతిలో రైతులు వరి సాగు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
డ్రమ్ సీడర్ ఎంతో మేలు..
యాసంగి సీజన్ వరిసాగు చేస్తున్న రైతులు డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులను అవలంభించడానికి సిద్ధమవుతున్నారు. డ్రమ్ సీడర్‌తో ఎంతో మేలు ఉంది. దీంతో తక్కువ ధర ఉండడంతో రైతులు డ్రమ్ సీడర్‌ను కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్ సీడర్ విత్తనాలు వెదజల్లడంతో నిర్దిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. కలుపు తీసే సమయంలో ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాధారణ పంట సాగుతో పోల్చితే డ్రమ్ సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికివస్తుంది. అదనంగా 3 నుంచి 4 బస్తాల దిగుబడినిస్తుంది. వినూత్న పద్ధతిలో చేపడుతున్న సాగు విధానాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు.
వెదజల్లే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్తవేత్తలు
వెదజల్లే పద్ధతిలో వరిసాగు కోసం గొర్రు తోలుతున్న రైతు
డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతుల్లో వరి సాగుకు ఆదరణ
తక్కువ ఖర్చుతో అన్నదాతల ఆసక్తి
రైతన్న మొగ్గు
రైతన్న మొగ్గు


