టెన్షన్.. టెన్షన్!
నేడు వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రకటించే అవకాశం
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపుపై రాష్ట్ర ఉన్నతాధికారుల మున్సిపాలిటీల వారీగా వార్డుల రిజర్వేషన్ల సంఖ్యను ప్రకటించారు. అయితే వార్డులకు రిజర్వేషన్ ప్రక్రియను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేసి శనివారం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ప్రక్రియ పూర్తి
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీల్లో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చిన జాబితా ప్రకారం బీసీల జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు కేటాయించి ప్రకటించారు. అయితే ఈ జాబితా ప్రకారం ఐదు మున్సిపాలిటీల అధికారులు, కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు తుది జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను శనివారం లేదా సోమవారం ప్రకటించే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ మాత్రం రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరుగుతోందని, నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలుపు తున్నారు.
ఆశావహుల్లో ఉత్కంఠ
గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు.. గెలిచి మళ్లీ పోటీలో నిలబడాలనే ఆలోచనతో వార్డుల్లో పనులు చేసిన వారితోపాటు.. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు పోటీకి సిద్ధం అన్నట్లు ఎదురు చూసే ఆశావహులు రిజర్వేషన్ల ప్రకటనపై ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పటికే కొందరు వార్డుల్లో తిరుగుతూ.. స్థానిక పెద్దమనుషులను కలిసి తాను పోటీలో ఉంటున్నానని, సహకరించాలని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇంతా చేసిన తమకు రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో రాదో అనే ఆలోచనతో కొట్టుమిట్టాడు తున్నారు.
త్వరలో మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల ప్రకటన
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్
బీసీ డెడికేషన్ జాబితా ప్రకారం బీసీలకు స్థానాల కేటాయింపు
మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు..
మున్సిపాలిటీ ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ మొత్తం
జనరల్–మహిళ జనరల్–మహిళ జనరల్–మహిళ జనరల్–మహిళ
మహబూబాబాద్ 04–03 03–02 03–03 10–08 36
డోర్నకల్ 02–02 02–01 00–00 04–04 15
మరిపెడ 03–03 01–00 00–00 04–04 15
తొర్రూరు 01–01 02–01 02–01 05–03 16
కేసముద్రం 02–01 01–01 02–01 05–03 16
మొత్తం 12–10 09–05 07–05 28–22 98
టెన్షన్.. టెన్షన్!


